మాఅల్లుడు మరో యువతిని తీసుకువెళ్ళాడని … వారి జాడ చెప్పాలని రెయిన్ బజార్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ వృద్దుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదన్న పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం తీవ్ర కలకలం రేపుతుంది. వివరాలలోకి వెళితే… పాతబస్తీ యాకుత్పురా ఎస్ఆర్టి కాలనీకి చెందిన యూనుస్ ఖాన్ (75) సోదరి కుమారుడు వరుసకు అల్లుడు. 2023 జనవరి నెలలో అల్లుడు ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో లేవదీసుకు వెళ్ళాడు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో సదరు బాలిక తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు యూసుఫ్ ఖాన్ కుటుంబంపై రెయిన్ బజార్ పోలీసులు గత నెలరోజులుగా తీవ్ర ఒత్తిడి చేయసాగారు. శుక్రవారం రాత్రి కూడా మరో మారు రెయిన్ బజార్ పోలీసులు ఫోన్ చేసి వాళ్ల ఆచూకీ చెప్పక పోతే తీసుకువెళ్తాం అని బెదిరించారని, యూనుస్ ఖాన్కు చెప్పారు. దీంతో అప్పటికే టెన్షన్ లో ఉన్న యూనుస్ ఖాన్ శనివారం ఉదయం సెల్ఫీ వీడియో చేసి మరీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రెయిన్ బజార్ పోలీసులు మాత్రం ఎవరిని టార్చెర్ చేయలేదని, కేవలం సమన్లు ఇచ్చామని చెప్పారు. ఈ కేసును మాదన్న పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




