పెళ్ళైన మొదట్లో బాగానే ఉన్నారు కొద్దిరోజులుగా వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాకపోవడంతో అల్లుడిని, అతని తల్లిదండ్రుల్ని కత్తులతో పొడిచి చంపారు.
ముప్పాళ్ళ మండలం దమ్మలపాడుకు చెందిన మాధురికి పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అనంతం నరేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంత కాలంగా మాధురి, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మాధురికి అత్తింటి వారి నుండి వేధింపులు ఎక్కువ కావడంతో పెద్దల సమక్షంలో చర్చించుకునేందుకు మాధురి తరుపు బంధువులు కోనంకికి వచ్చారు. ఈ క్రమంలో మాధురి అత్తింటి వారికి పుట్టింటి వారికి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో ఇరు కుటుంబాల మధ్య మాట మాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు విచక్షణ కోల్పోయి.. కూతురి భర్తను, అత్త మామల మీద కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతం నరేష్ (30), అతని తల్లిదండ్రులు ఆదిలక్ష్మి,(50) సాంబయ్య (56)లు అక్కడికక్కడే మృతిచెందారు.