spot_img
Monday, March 23, 2026
spot_img

ఘోరం.. యువతిపై ఏడుగురు సామూహిక అత్యాచారం..

హావేరి జిల్లా హానగల్‌లో యువతిపై ఏడుగురు గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసులు విచారణను తీవ్రం చేశారు. ఘటనాస్థలంలో పరిశీలించి సాక్ష్యాలను సేకరించారు. నాలుగో నిందితున్ని అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు సాగుతోంది. ఘటనాస్థలిని పోలీసులు శుక్రవారం, శనివారం పరిశీలించారు. బాధిత యువతి ధరించిన దుస్తులను ఫోరెన్సిక్‌ నిపుణులు స్వాధీనం చేసుకుని పరీక్షలు చేపట్టారు.

చేతులు మొక్కి వేడుకున్నా..
హానగల్‌ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు బాధిత మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు అటు లాడ్జి, ఇటు ఘటనాస్థలిలోని ఆధారాలను తీసుకుని ల్యాబ్‌కు పంపారు. లాడ్జి గదిలో తనపై ఏడుమంది అత్యాచారం చేశారని, ఆపై బైకులో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో మూడుచోట్ల మళ్లీ దారుణానికి పాల్పడి, చివరకు హానగల్‌ బస్టాండ్‌కు కారులో తెచ్చి వదలి వెళ్లారని ఆ యువతి ఫిర్యాదులో తెలిపింది. కొన్నిగంటలపాటు ఈ ఘోరం కొనసాగింది. నన్నేం చేయవద్దని మొక్కి వేడుకున్నా దుండగులు జాలి చూపలేదని వాపోయింది. ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్‌ చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా, మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ఆ రోజు ఏం జరిగిందంటే..
జనవరి 8వ తేదీన ఒక వర్గానికి చెందిన యువతి, మరో వర్గానికి చెందిన వ్యక్తి కలిసి లాడ్జిలో గదిలో దిగారు. ఈ సమయంలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు గదిలోకి చొరబడి ఆ జంటను కొట్టారు. ఆపై యువతి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొన్నాళ్లపాటు మౌనంగా వేదన భరించిన బాధితురాలు చివరకు 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాజకీయంగా అలజడి రేపింది. కాంగ్రెస్‌సర్కారు పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దేశవ్యాప్తంగానూ మీడియాలో వైరల్‌గా మారడంతో సర్కారుకు ఇబ్బందిగా మారింది.

రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా?
సర్కారుపై బొమ్మై ధ్వజం
శివాజీనగర: హావేరితో పాటు వివిధ జిల్లాల్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసుల్లో బాధితులకు స్థానిక పోలీసులచే న్యాయం దొరకదు. అందుచేత ఉన్నతస్థాయి విచారణకు ప్రత్యేక విచారణ బృందం (ఎస్‌ఐటీ)ను నియమించాలని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని మల్లేశ్వరంలోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్దేశిత కాలావధిలో సీనియర్‌ పోలీస్‌ అధికారులతో దర్యాప్తు చేయించి దోషులకు కఠినశిక్ష పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని అన్నారు.

ఆదివారం తమ పార్టీ మహిళా బృందం హావేరికి వెళ్తుందని, అలాగే సమగ్ర విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారాయి. సామాన్య ప్రజలు, మహిళలు భయంతో జీవిస్తున్నారు. బెంగళూరులోనే మహిళలపై నేరాలు 30 శాతం కంటే ఎక్కువయ్యాయి. పోలీసులు ఇటువంటి కేసులను క్లోజ్‌ చేస్తున్నారు. వారు ప్రేక్షపాత్రను వహిస్తున్నారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభకు అతి సమీపంలోనే ఒక మహిళను కొట్టి వివస్త్రను చేశారు, ఈ కేసుల్లో సక్రమంగా విచారణలు జరగడం లేదు అని బొమ్మై దుయ్యబట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular