spot_img
Saturday, July 19, 2025
spot_img

చైల్డ్‌పోర్న్‌ చూసిన 15మంది అరెస్ట్‌…చిన్నపిల్లల అశ్లీల వీడియోలు చూసిన వారిపై చర్యలు.డౌన్‌లోడ్‌, ఫార్వార్డ్‌ చేసిన వారిపైనా సీఎస్‌బీ కొరడా

ఆన్‌లైన్‌లో చిన్న పిల్లల అశ్లీల వీడియోలు చూడటం, డౌన్‌లోడ్‌, స్టోరేజ్‌, ఫార్వార్డ్‌ చేస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్టు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డీజీ శిఖాగోయెల్‌ తెలిపారు. నిందితులంతా పదేపదే ఆ వీడియోలు చూస్తూ, ప్రభావితమవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆమె మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

18న హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, జగిత్యాల, యాదాద్రి, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. దేశంలో సైబర్‌ టిప్‌లైన్‌లు, చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలు వీక్షించే వారికి సంబంధించి ఫిర్యాదులను సమన్వయం చేయడానికి సీఎస్‌బీ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తున్నదని వివరించారు. ఫిబ్రవరిలో సీఎస్‌బీకి అనుబంధంగా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (సీపీయూ) ఏర్పాటు చేశామని, నాలుగు నెలల్లోనే 294 కేసులు నమోదు చేసి, 110 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

ఇలాంటి కేసులలో అరెస్టయిన వారిపై ఐటీ చట్టం సెక్షన్‌ 67-బీ, పోక్సో చట్టం సెక్షన్‌ 15 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో సుమారు 220 వెబ్‌సైట్స్‌, యాప్స్‌ను బ్లాక్‌ చేశామని వెల్లడించారు. సమావేశంలో సీఎస్‌బీ ఎస్పీ హర్షవర్ధన్‌, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్‌, భిక్షంరెడ్డి, వాసు, వెంకటేశ్వరావు, హరికృష్ణ, సూర్యప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘చైల్డ్‌పోర్న్‌’ గురించి వెతికినా నేరమే

ఇంటర్‌నెట్‌, యాప్స్‌, ఆన్‌లైన్‌ వేదికలపై చిన్నపిల్లల అశ్లీల దృశ్యాల గురించి వెతికినా కూడా నేరంగానే పరిగణిస్తాం. ఈ తరహా అంశాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. చైల్డ్‌పోర్న్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసినా, షేర్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. పోర్న్‌ వీడియోలు పోస్టు చేస్తున్న సోషల్‌మీడియా వేదికల యజమానులకు కూడా సూచనలు చేశాం. ఈ విషయాలపై అవగాహన కలిగినవారు ఇతరులకు అవగాహన కల్పించాలి. డిజిటల్‌ స్పేస్‌లో పిల్లల భద్రత కోసం అండగా ఉంటాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి చట్టపరంగా శిక్ష తప్పదనే బలమైన సందేశాన్ని పంపించడమే ఈ ఆపరేషన్‌ ముఖ్య లక్ష్యం.

-శిఖా గోయెల్‌, టీఎస్‌సీఎస్‌బీ డీజీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular