spot_img
Wednesday, March 25, 2026
spot_img

డబ్బు తీసుకుని మోసగించాడనీ అప్పు తీసుకున్న వ్యక్తి బార్య హత్య

వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో డబ్బు తీసుకొని మోసగించారనే కోపంతో ఓ వ్యక్తిని, అతడి భార్యను హతమార్చిన కేసును పోలీసులు ఛేదించి నిదితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫిల్మ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంజీఎస్‌ రామకృష్ణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ టోలిచౌకి సత్యకాలనీలో సయ్యద్‌ అహ్మద్‌ ఖాద్రీ అలియాస్‌ జుబేర్‌(45), సయ్యద్‌ మిరాజ్‌ ఫాతిమా(40) దంపతులు నివాసం ఉంటున్నారు. ఫాతిమా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డైటీషియన్‌గా పనిచేసేవారు. ఆమె సంపాదనతో ఖాద్రీ జల్సాలు చేస్తుండేవాడు. నదీమ్‌ కాలనీలో నివసిస్తున్న ముంబయికి చెందిన మేకల వ్యాపారి అజ్గర్‌ షేక్‌ అలియాస్‌ అన్వర్‌తో ఖాద్రీతో పరిచయం ఏర్పడింది. తనకు 100 ఎకరాల పొలం ఉందని.. అక్కడ మేకల ఫాం ఏర్పాటు చేస్తే అధిక లాభాలు వస్తాయని అజ్గర్‌ను నమ్మించాడు. పలు దఫాలుగా రూ.20 లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా మేకల ఫాం అంశం ఊసెత్తలేదు. తన డబ్బు తిరిగివ్వాలని అజ్గర్‌ పలుమార్లు అడగగా.. ఖాద్రీ వాయిదా వేస్తూ వచ్చాడు. ఖాద్రీ గురించి అజ్గర్‌ ఆరా తీయగా.. అతనికి పొలం, ఆస్తిపాస్తులేవీ లేవని తెలిసింది. తనను మోసగించాడని, అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు మహ్మద్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సల్మాన్‌తో కలిసి పథకం రూపొందించాడు.

గతనెల 28న తన ఇంటికి విందుకు రావాలని ఖాద్రీని ఆహ్వానించాడు. విందు అనంతరం ఖాద్రీపై ముగ్గురూ దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని సమీపంలోని షాతన్‌ తలాబ్‌ చెరువులో పూడ్చిపెట్టారు. మరుసటిరోజు ఖాద్రీ ఇంటికి వెళ్లి.. డబ్బు తిరిగివ్వాలని ఫాతిమాను అడిగారు. భర్తే తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నాడని చెప్పటంతో.. ఆమె మెడ చుట్టూ చున్నీ బిగించి హతమార్చారు. ఆత్మహత్యకు పాల్పడినట్టు నమ్మించేందుకు ఫ్యాన్‌కు ఉరేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని విలువైన వస్తువులు తస్కరించారు. అనంతరం గ్యాస్‌ లీక్‌ చేసి పారిపోయారు. ఎవరైనా విద్యుత్‌ బల్బు స్విచ్చాన్‌ చేస్తే ఇల్లంతా పేలిపోయి ఆనవాళ్లు లభించవన్న ఉద్దేశంతో ఇలా చేశారు. ఫాతిమాకు సోదరి ఫోన్‌ చేయగా.. ఆమె ఎంతకీ ఎత్తకపోవడంతో ఇంటికెళ్లింది. తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఫాతిమా ఉరేసుకుని మృతి చెందినట్లు ఉంది. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండొచ్చనే అనుమానంతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు సోదరి ఫిర్యాదు చేసింది. ఖాద్రీ ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావటం, ఆచూకీ లభించకపోవడంతో.. పోలీసులు ఫోన్‌ కాల్స్‌, టవర్‌ లొకేషన్‌ వివరాలు, సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. మణికొండకు చెందిన సల్మాన్‌ తరచూ ఖాద్రీ వద్దకు వచ్చేవాడని నిర్ధారణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో అసలు విషయం బయటపడింది. హత్యల అనంతరం అజ్గర్‌, హుస్సేన్‌ ముంబయి పారిపోయినట్టు గుర్తించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular