నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు.పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్, సిడ్నీ క్వాకర్స్ హిల్, లవర్ గ్రోవ్‌డ్రైవ్‌లో నివాసముండే పరితోష్ ఉపాధ్యాయ్‌కు యాక్సిస్ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో 2017 నుంచి ఖాతా ఉన్నది.
బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ, ఉద్యోగులు సురేఖ, హరి విజయ్, శ్రీదేవి, రఘుతో కలిసి ఆయన ఖాతాలోని డబ్బులను కాజేసేందుకు పథకం రచించారు. నకిలీ చెక్కులు తయారు చేసి, దానిపై సంతకాలు ఫోర్జరీ చేసి ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు డ్రా చేసుకున్నారు.
అక్టోబర్ 21న యాక్సిస్ బ్యాంకులోని ఖాతాను మూసివేసినట్టుగా మెయిల్ రావడంతో పరితోష్ కంగుతిన్నాడు. విచారించగా 42 నకిలీ చెక్కులతో డబ్బులు దోచుకున్నట్టు గుర్తించాడు. ఈ విషయంపై బ్యాంకు సీఈవోను సంప్రదించగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు, కోర్టు రిఫర్ కేసు అయినా నెల రోజుల వరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.