బ్లాక్ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ప్రవేశించిన దుండగులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్‌లో ఉన్న దాదాపు 8 లక్షల నగదు చోరీ చేశారు. చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..
హఫీజ్‌పేట్‌లోని వరల్డ్ వన్ ప్రైవేటు స్కూల్‌లో శనివారం (మార్చి 17) అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. చెడ్డీలు ధరించి, ముఖాలకు ముసుగు ధరించి మారణాయుధాలతో వచ్చిన చెడ్డీ గ్యాంగ్ ముఠా స్కూల్ కార్యాలయంలోని కౌంటర్‌లో రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒంటి మీద దుస్తులు లేకుండా కేవలం చెడ్డీలతో వచ్చిన ఈ గ్యాంగ్ పాఠశాల కార్యాలయంలో సంచరించడం వీడియోలో చూడొచ్చు
పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీలను పోలీసులకు సమర్పించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా గతంలోనూ ఒకట్రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలు నగరంలో చోటు చేసుకున్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.