డబ్బు ఆశ చూపించి హైదరాబాద్‌లో పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి.. అహ్మదాబాద్‌లో ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తున్న ముఠాలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఇండియన్ స్పెర్మ్‌టెక్’ పేరుతో వారు నిర్వహిస్తున్న స్పెర్మ్ బ్యాంకులోని యంత్రాలు, రిజిస్టర్లతో పాటు సరగసీ అప్లికేషన్లనూ స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని బ్లూ సీ హోటల్‌పై అంతస్తులో ఇండియన్ స్పెర్మ్‌టెక్ క్రయోసిస్టం క్లినిక్ ఉంది.
దాని యజమాని పంకజ్ సోనీ. అతడు కొంతమందిని తన వద్ద ఉద్యోగులుగా, ఏజెంట్లుగా టెక్నీషియన్‌లుగా నియమించుకున్నాడు. వారి సహకారంతో.. వయసులో ఉన్న స్త్రీ, పురుషులకు డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు. సేకరించిన అండాలను, వీర్యాన్ని అహ్మదాబాద్‌లోని ఒక ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తున్నారు. స్పెర్మ్, అండాలు ఇస్తున్న డోనర్స్‌కు డిమాండ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.4 వేల దాకా చెల్లిస్తున్నారు. ఈ అక్రమ దందా గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి.. స్పెర్మ్‌టెక్ మేనేజర్ పంకజ్ సోనీ, క్యాషియర్ సంపత్, ఉద్యోగులు (ఏజెంట్లు) శ్రీను, జితేందర్ కుమావత్, శివ (బ్రోకర్), మణికంఠ (బ్రోకర్), కన్సారీ బరో (ఎగ్ డోనర్)లను అరెస్టు చేశారు.
నగరం నడిబొడ్డున.. వీర్యం, అండాల దందా..డిమాండ్‌ను బట్టి డోనర్లకు రూ.4 వేల దాకా
RELATED ARTICLES