వినీలాకాశంలో వెలిగిపోదామంటూ వచ్చే అమ్మాయిలు అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి గురించి రోజుకొక వ్యవహారం వెలుగులోకి వస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి వ్యవహారాలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే.ఈ నివేదిక ఆధారంగా నమోదు చేసిన 35 కేసులపై వాంగ్మూలం ఇవ్వడానికి బాధితులు ముందుకు రాకపోవడంతో ఈ కేసులను సిట్ మూసివేసింది. ఇండస్ట్రీలో పెద్దవాళ్లకు ఎదురుతిరిగే ధైర్యం ఎవరికీ లేదని మరోసారి రుజువైంది.విద్యాబాలన్‌కు వేధింపులు
తమ కెరీర్‌లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రతిరోజూ ఎవరో ఒక హీరోయిన్ బయట పెడుతూనే ఉన్నారు. చిన్నాచితకా హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కొద్దిరోజుల క్రితం తన జీవితంలో చేదు అనుభవాన్ని బయటపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో ఓ నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించాడని, అభ్యంతరకరంగా పిలిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు తనను తీవ్రంగా బాధించడంతో ఆరు నెలల పాటు నా ముఖాన్ని కూడా చూసుకోలేకపోయానని తెలిపారు. ఇలాంటివి తన జీవితంలో ఎన్నో జరిగాయని విద్యాబాలన్ వాపోయారు.
దక్షిణాదిపై దంగల్ బ్యూటీ ఆరోపణలు
దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ దక్షిణాది చిత్ర పరిశ్రమపై చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సౌత్‌లో ఓ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఓ ఏజెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పాడని ఫాతిమా తెలిపింది. ఆ మాటల వెనుక ఆంతర్యాన్ని వెంటనే అర్ధం చేసుకున్నప్పటికీ.. ఏం తెలియనట్లు సైలెంట్‌గా ఉండటంతో మళ్లీ మళ్లీ అదే మాటలు మాట్లాడాడని దంగల్ నటి చెప్పింది. ఆమె వ్యాఖ్యలపై దక్షిణాది నుంచి ట్రోలింగ్ జరగడంతో ఫాతిమా స్పందించారు. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. మొత్తం దక్షిణాదిని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
హర్యానా నటుడిపై ఆరోపణలు
తాజాగా.. హర్యానాకు చెందిన ప్రముఖ నటుడు ఉత్తర్ కుమార్‌పై ఓ మహిళా నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు . సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన రజ్జీ బోల్జా అనే సూపర్‌హిట్ సాంగ్‌తో సదరు నటి పాపులర్ అయ్యారు. ఉత్తర్ కుమార్ చాలాకాలంగా అబద్ధాలు చెబుతూ తనను తప్పుదారి పట్టించాడని ఆమె ఆరోపించారు. ఉత్తర్‌తో ఐదేళ్ల పాటు పనిచేశానని.. ఆ సమయంలో సినిమాలలో అవకాశం వస్తుందని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని చెప్పింది. అతని మాటలు నమ్మి ఉత్తర్‌తో శారీరకంగా కలిశానని.. కానీ ఆయన తన హామీ నిలబెట్టుకోలేదని తెలిపింది.ఫాంహౌస్‌కి వెళ్లాల్సిందే
2020లో రజ్జీ బోల్జా షూటింగ్ సమయంలో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఉత్తర్ కుమార్ మూడేళ్ల పాటు తనను ఫాంహౌస్‌కి.. అతని ప్రైవేట్ కార్యాలయానికి తరచుగా పిలిపించుకుని లైంగిక వాంఛ తీర్చుకునేవాడని బాధితురాలు ఆరోపించింది. నేను మరోచోట పనిచేస్తానని చెప్పినా అంగీకరించలేదని, అతని ఉచ్చులో తనతో పాటు ఎంతో మంది అమ్మాయిలు పడ్డారని పేర్కొంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, రాజీకి అంగీకరించాలని నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సదరు నటి ఆరోపించింది. ఈ వ్యవహారంపై సైలెంట్‌గా ఉండాలని ఉత్తర్ కుమార్ నాకు డబ్బులు కూడా ఇచ్చాడని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. ఘజియాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.