ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ను (Allu Arjun) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద (sandhya theatre incident) తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.. బన్నిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
సంధ్య థియేటర్ వద్ద అసలేం ఏం జరిగిందంటే?
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప2: ది రూల్’. డిసెంబరు 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 4న (బుధవారం) వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఇటీవల వెల్లడించారు. ”బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా.. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు”’రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




