(‘ఆంధ్రప్రదేశ్ వాచ్’ సౌజన్యం తో)
పోలీసోడైతే ఏంటి.. తల పగలగొట్టండి
* ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌పై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన వైకాపా నేత రాజగోపాల్‌రెడ్డి
* 20 మంది అనుచరులను పోగేసి కర్రలతో విచక్షణ రహితంగా దాడి
* బాధిత సీఐతోపాటు సహాయంగా వచ్చిన మరో సీఐ, ఎస్సైలపై పోలీసుల రివర్స్ కేసు
పాముకు పాలు పోసి పెంచితే.. పాత సామెత. అదే అధికార మందం ఎక్కిన ‘అనకొండ’ను ‘బీఫ్ బిర్యానీ’ పెట్టి పెంచితే ఏం అవుతుంది.? ఏదో ఒక రోజు నువ్వు మటాష్. పోలీసు పాలన వ్యవస్థలో సమతుల్యం దెబ్బ తింటే… అది (ఆ)రాజకీయుల కొమ్ము కాస్తే ఏం జరుగుతుందో ఒకసారి సరదాగా ‘కడప’పై ఓ కన్నేద్దాం.
(నోట్: మీం సామాన్య పౌరులం. ‘సరదా’గానే చూస్తాం. నిజాయితీగా ఉండాల్సింది పోలీస్ ఉన్నతాధికారులే..! నో ఫుల్ సెల్యూట్. ఓన్లీ ఆఫ్ సెల్యూట్.!)
ఇదెక్కడి విడ్డూరం:
‘పోలీసోడైతే ఏంటి? ఎవడైతే ఏంటి? వాణ్ని లాగిపడేయండ్రా! వాడి తలపగలగొట్టండి.. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా’ అంటూ కడపలోని మయూరా గార్డెన్ రెస్టారెంట్ యజమాని కారపురెడ్డి రాజగోపాల్‌రెడ్డి (ఈయన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రధాన అనుచరుడు), ఆయన వద్ద పనిచేసే అల్లరిమూకలు నా భర్తపై విచక్షణరహితంగా దాడి చేశారు’ అని నిఘా విభాగం ఇన్‌స్పెక్టర్ అనిల్ సతీమణి శ్వేత వాపోయారు. వీధిలో అల్లరి చేస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతున్న వారిని ప్రశ్నించినందుకు దాదాపు 20 మందికి పైగా ఒక్కటై.. తన భర్తను కర్రలతో తీవ్రంగా కొట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను అక్కడికి వెళ్లి నిలువరించకపోతే ఆయన్ను చంపేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసోడైతే ఏంటి.. తల పగలగొట్టండి
వీపుపై వాతలు తేలేలా, కాలి వేలు విరిగేలా కొట్టారన్నారు. ఇంత దారుణం జరిగినా బాధితుడైన తన భర్తపైన, ఆయన్ను కాపాడేందుకు వచ్చిన సహచరులపైన కేసు నమోదు చేయటమేంటో అర్థం కావట్లేదని వాపోయారు. దాడికి సంబంధించిన వీడియోలు సైతం పోలీసులకు సమర్పించినా పట్టించుకోలేదని చెప్పారు. రెండు రోజుల కిందట కడపలో వైకాపా శ్రేణుల దాడిలో నిఘా విభాగం ఇన్‌స్పెక్టర్ అనిల్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులపైన హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిన పోలీసులు.. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు, పైరవీలకు తలొగ్గి దాడి చేసిన వారితోపాటు దాడికి గురైన అనిల్‌పైనా, ఆయనకు సాయంగా వచ్చిన మరో సీఐ, ఎస్సైపైనా కూడా అవే సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ అంశంపై అనిల్ సతీమణి శ్వేత సోమవారం ‘ఆంధ్రప్రదేశ్ వాచ్’తో తన ఆవేదన చెప్పారు.
నిందితులకు మద్దతుగా వైకాపా నాయకులు
‘మయూరా గార్డెన్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న కొంతమంది అస్సాం, బిహార్, పశ్చిమబెంగాల్ యువకులు మా వీధిలో కొన్నాళ్లుగా అల్లర్లకు పాల్పడుతున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై గతంలో ఒకసారి వారిని నా భర్త ప్రశ్నించారు. అప్పటి నుంచి మావారి బైక్ పెట్రోల్ పైప్ కట్ చేయటం, పెట్రోల్ దొంగిలించటం చేసేవారు. అయినా మేమెప్పుడూ వివాదం జోలికి వెళ్లలేదు. రెండు రోజుల కిందట ఆయనపై ఒకేసారి 20 మందికి పైగా యువకులు దాడికి పాల్పడ్డారు.
ఆయన అరుపులు విని..
ఇంట్లో నుంచి నేను పరిగెత్తుకు వెళ్లేసరికి ఇష్టానుసారం కొడుతున్నారు. దీంతో మా ఆయనతో కలిసి పనిచేసే ఇంటెలిజెన్స్ సిబ్బందికి ఫోన్ చేశాను. వారు బ్లూకోల్ట్స్‌కు చెప్పటంతో వారొచ్చి అందర్నీ పంపించేశారు. ఈ ఘటనపై ఫిర్యాదివ్వటానికి అదే రోజు రాత్రి 11.20 గంటలకు పోలీసుస్టేషన్‌కు వెళ్లాం. నిందితులకు మద్దతుగా వైకాపా నాయకులు రావడంతో మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమైంది’ అని శ్వేత వాపోయారు.
పోలీసోడైతే ఏంటి.. తల పగలగొట్టండి
సీఐపై దాడి వ్యవహారంలో కీలక మలుపు
కడపలో వైకాపా మూకల దాడిలో గాయపడిన సీఐతో పాటు ఆయనకు సాయపడిన మరో సీఐ, ఎస్సైపైనా కేసు నమోదు చేశారు. కడపలోని ఆర్‌కేనగర్ కో-ఆపరేటివ్ కాలనీలో ఈ నెల 9న రాత్రి 11 గంటలకు ఓ హోటల్‌లో పని చేసే కార్మికులు అన్నమయ్య జిల్లాలో పనిచేసే ఇంటలిజెన్స్ సీఐ అనిల్‌కుమార్ నివాసం ఉన్న వీధిలో అల్లరి చేస్తున్నారు. సీఐ మందలించడంతో కార్మికులు ఆయన్ను చితకబాదారు. సీఐ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా హోటల్ యజమానికి అధికార పార్టీ అండదండలు ఉండటంతో వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. నగరంలోని కీలక నేతల రంగ ప్రవేశంతో పోలీసు అధికారులు కేసు లేకుండా రాజీపడాలని బాధిత సీఐని హెచ్చరించారు.
ఆదివారం అర్ధరాత్రి వరకు…
కానీ ఆయన ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై తమకెలాంటి ఫిర్యాదూ అందలేదని ఆదివారం అర్ధరాత్రి వరకు పోలీసులు బుకాయించారు. ఈ ఘటన సంచలనం కావడంతో చివరకు కేసులు నమోదు చేశారు. రెస్టారెంట్ యజమాని కారపు రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధిత సీఐతో పాటు ఆయన స్నేహితులైన ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. దాడి జరుగుతుండగా అనిల్ భార్య ఫోన్ చేయడంతో సీఐ నాగరాజు, ఎస్సై శివప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకోవడమే నేరమన్నట్లుగా వారిపైనా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం.
సీఐ అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు…
కారపు రాజగోపాల్‌రెడ్డి, అవ్వారు గురుప్రసాద్, వెంకటరమణతో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ‘శనివారం రాత్రి కడపలో అనుకోకుండా ఘటన జరిగింది. సీఐ అనిల్‌కుమార్ పోలీసు అధికారని తెలియక హోటల్ కార్మికులు దాడి చేశారు. అస్సాంకు చెందిన వ్యక్తులు కావడంతో భాష సమస్య తలెత్తింది. సీఐకి చిన్న గీకుడు గాయం మాత్రమే అయింది. కార్మికులు తిరగబడ్డారన్నది అవాస్తవం. చట్టం అందరికీ సమానమే. రెండు వర్గాలపైనా కేసులు నమోదు చేశాం. పరాయి రాష్ట్రం నుంచి వచ్చి కార్మికులు పదేళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. సీఐ కార్మికులు నివసిస్తున్న గదికి వెళ్లి దాడి చేశారు’ అని డీఎస్పీ చెప్పడం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని ఉన్నతాధికారి బెదిరించారు
స్థానిక పోలీసుస్టేషన్‌లో న్యాయం జరగకపోవటంతో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా అక్కడ కూడా రివర్స్‌లో తమనే బెదిరించారని శ్వేత వాపోయారు.. ‘మయూరా గార్డెన్స్ కార్మికులను మీ భర్తే కొట్టారట. వారిలో కొందరు ఎస్సీలు కూడా ఉన్నారు. వారు కేసు పెడతామంటున్నారు. మీ భర్తపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి వస్తుంది. ఆలోచించుకుని రాజీ చేసుకోండి. అలా అయితే ఘర్షణకు కారణమైన వారిని అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయిస్తాం. మీడియాతో అసలు ఏమీ మాట్లాడొద్దు’ అంటూ హెచ్చరించారని శ్వేత చెప్పారు.