ప్రియుడి తో కలిసి భర్తను దారుణంగా చంపేసిన ఘటన అక్బర్‌పేట-భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది..రామేశ్వరంపల్లికి చెందిన మైలి నరసమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అందరికీ వివాహాలయ్యాయి.
చిన్న కుమారుడు మైలి నవీన్ కుమార్(37) గ్రామంలో కూలీ పని చేస్తూ, భార్య ఉదయరాణి, 8, 7 సంవత్సరాల వయసు గల కుమార్తెలు, 14 నెలల బాబుతో కలిసి జీవిస్తున్నాడు. కుమార్తెలు మెదక్ జిల్లాలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. తమ ఇంటి పక్కనే నివసించే శ్యామ నాగరాజు అలియాస్ తరుణ్ అనే యువకుడితో ఉదయరాణికి పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉండసాగారు. ఈ విషయంలో దంపతుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో నవీన్‌ను అడ్డు తొలగించుకోవాలని తరుణ్‌తో కలిసి ఆమె పథకం వేసింది. ఆదివారం సాయంత్రం కూలీ పని ముగించుకొని, కల్లు తాగి ఇంటికొచ్చిన నవీన్‌ను.. మద్యం తాగుదామని తరుణ్ బయటకు తీసుకెళ్లాడు. పూటుగా మద్యం తాగించి, ఇంటి తీసుకొస్తుండగా మార్గం మధ్యలో కిందపడిన నవీన్ తలకు, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి.అతన్ని అలాగే ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆ తర్వాత ఉదయరాణి, తరుణ్ కలిసి నవీన్ చేతులు కట్టేసి, ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో తల ముంచి.. హత్య చేశారు. మద్యం మత్తులో ఇంట్లో కింద పడడంతో తలకు గాయమై మృతి చెందాడని సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు ఉదయరాణి సమాచారం ఇచ్చింది.
ఉదయం అక్కడకు వచ్చిన మృతుడి తల్లి, సోదరులు నవీన్ తల వెనుక, కంటి వద్ద, మెడపై గాయాలు ఉండడం చూసి, ఆమెను గట్టిగా నిలదీశారు. ప్రియుడితో కలిసి తానే చంపానని అంగీకరించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి, ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితులిద్దరూ అంగీకరించారు. మృతుడి సోదరుడు ఆనందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
RELATED ARTICLES