spot_img
Wednesday, March 25, 2026
spot_img

ఫేక్ పాస్పోర్ట్ కేసులో లుక్కోట్ నోటీసులు జారీ చేసిన సిఐడి పోలీసులు

నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు పొందిన కేసు దర్యాప్తులో తెలంగాణ సీఐడీ దూకుడు పెంచింది. ఇలా పాస్‌పోర్టులు తీసుకున్న వారిలో ఇప్పటికే 92 మంది విదేశాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన నేపథ్యంలో.. మిగిలిన వారు దేశం దాటకుండా నిలువరించేందుకు లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీకి సిద్ధమవుతోంది. ఇందులో పలువురు విదేశీయులున్న నేపథ్యంలో అవసరమైతే రెడ్‌కార్నర్‌ నోటీసు ఇచ్చే యోచనతో ఉంది. మరోవైపు ఆ పాస్‌పోర్టులను రద్దు చేయాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాని(ఆర్‌పీఓ)కి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. విదేశాలకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ సాయం తీసుకుంటోంది. ఈ కుంభకోణంలో మరికొందరు ఏజెంట్ల పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్న సీఐడీ త్వరలోనే వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసిన సీఐడీ ఎక్కువగా జగిత్యాలతోపాటు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా చిరునామాలతో పాస్‌పోర్టులు జారీ అయినట్లు గుర్తించింది. ఈ కుట్రలో కీలక సూత్రధారి అబ్దుస్‌ సత్తార్‌ ఒస్మాన్‌ అల్‌ జవహరి తప్పుడు ఆధార్‌, పాన్‌ వంటి పత్రాలతోపాటు హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రి పేరిట నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు తేలింది. వాటిని హైదరాబాద్‌, కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌లలోని ఏజెంట్లకు పంపించి వారి ద్వారా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు చేయించినట్లు వెల్లడైంది.

నిరక్షరాస్యులు ఉపాధికి గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలంటే ఇమిగ్రేషన్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డ్‌(ఈసీఎన్‌ఆర్‌) కేటగిరీ పాస్‌పోర్టు పొందాల్సి ఉంటుంది. దీని ద్వారా తక్కువస్థాయి ఉద్యోగాలు మాత్రమే లభిస్తాయి. ఈ క్రమంలో నకిలీ పదో తరగతి మెమోలు సృష్టించారు. అనంతరం పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో(పీఎస్‌కే) సులభంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు అధికారులకు ఏజెంట్లు లంచాలు ఎర వేసినట్లు సీఐడీ అనుమానిస్తోంది. హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలోని పీఎస్‌కేల్లో ఏజెంట్లు స్లాట్లు బుక్‌ చేసినట్లు గుర్తించడంతో అక్కడి అధికారులెవరైనా వారికి సహకరించారా..? అనే కోణంలో ఆరా తీస్తోంది. తర్వాత స్పెషల్‌బ్రాంచ్‌(ఎస్‌బీ) విచారణలోనూ లంచాలు ముట్టజెప్పినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది.

ఈ కుంభకోణానికి సంబంధించి ఇంతవరకూ తమ దర్యాప్తులో వెల్లడైన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖతో పంచుకుని.. తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారించారు. వారిని వెనక్కి రప్పించి, విచారించి, సహకరించిన వారి వివరాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసినప్పుడే కేసు బలంగా నిలబడుతుంది. దీనిలో భాగంగా వీరందరి వివరాలను విదేశీ వ్యవహారాల శాఖకు పంపారు. వారి పాస్‌పోర్టులు కూడా రద్దు చేయాలని సిఫార్సు చేశారు. పాస్‌పోర్టు రద్దయిన విషయం వారు ఉన్న దేశానికి పంపుతారు. అప్పుడు ఆయా దేశాలు వారిని బలవంతంగా వెనక్కి పంపుతాయి. అందుకే అసలు వీరు ఏయే దేశాల్లో ఉన్నారో అనే విషయాన్ని గుర్తించబోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular