ప్రేమించాలని, లేకుంటే నీపై, నీ కుటుంబ సభ్యులపై యాసిడ్‌పోసి చంపేస్తానని బాలికను బెదిరించడంతో పాటు ఆమెను అపహరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టణానికి చెందిన బాలిక(16) స్థానిక ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెను జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడేనికి చెందిన ఇంజే రాజ్‌కుమార్ అనే యువకుడు.. ప్రేమించాలని, లేకుంటే యాసిడ్ పోసి నిన్ను, నీ తల్లిదండ్రులను చంపేస్తానని తరచూ బెదిరిస్తున్నాడు. ఈ నెల 6న కొందరి సాయంతో బాలిక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఆమెను అపహరించి, ఆర్టీసీ బస్సులో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు తీసుకెళ్లాడు. అక్కడ రాజ్‌కుమార్ సోదరుడి సహాయంతో గది అద్దెకు తీసుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమార్తె సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను రక్షించి, నిందితుడిని పట్టుకొని జంగారెడ్డిగూడెం తీసుకొచ్చారు. అనంతరం రాజ్‌కుమార్ బంధువులు 50 మందికి పైగా వచ్చి అతడిని తీసుకెళ్లినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో, ఇతర కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి వెల్లడించారు.