spot_img
Monday, September 29, 2025
spot_img

బ్యాచ్‌లర్స్‌కు రూమ్ అద్దెకు ఇచ్చి మరీ.. వీర్యం సేకరణ.. అమ్మాయిలతో ఏం చేస్తున్నారో తెలుసా

మేడ్చల్ సరోగసి కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ సరోగసి దందా ఆసుపత్రుల విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మి రెడ్డి అనే మహిళ, ఆమె కుమారుడు సురేందర్ రెడ్డి కలిసి చేస్తున్న ఈ వ్యాపారం సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది.

మేడ్చల్ సరోగసి కేసులో పోలీసుల విచారణలో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మిరెడ్డి తన ఇంటి మొదటి అంతస్తును కేవలం బ్యాచిలర్స్‌కు అద్దెకు ఇచ్చి, వారి నుంచి వీర్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాదాపూర్, అమీర్‌పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో పరిచయాలు పెంచుకొని.. అండాలు కావాలన్నా, సరోగసికి మహిళలు కావాలన్నా వీరు ఏర్పాటు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

మూడుసార్లు అండాలు ఇస్తే రూ. 30,000, సరోగసి ద్వారా బిడ్డలను కని ఇస్తే రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పి.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక మహిళలను వీరు ఈ దందాలోకి లాగుతున్నారు. ఇలాంటి మోసాల వల్ల మహిళల ఆరోగ్యం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయి. గతంలో లక్ష్మి రెడ్డిపై ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు ఆధారాలు సేకరించారు. లక్ష్మిరెడ్డి ఒక డైరీలో సరోగసికి అంగీకరించిన మహిళల పేర్లు, వారికి ఇచ్చిన డబ్బుల వివరాలు రాసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఆరు ఆసుపత్రుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. వాటికి నోటీసులు జారీ చేశారు. పోలీసులు లక్ష్మిరెడ్డి, సురేందర్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇలాంటి నేరాలు కేవలం పోలీసుల చర్యలతోనే పరిష్కారం కావు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

సరోగసి గురించి.. దాని చట్టబద్ధత గురించి అవగాహన పెంచుకోవాలి. తెలియని వ్యక్తులు, మధ్యవర్తుల మాటలు నమ్మి తమ ఆరోగ్యం, భవిష్యత్తును ప్రమాదంలో పెట్టుకోకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, సాయం కోసం చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇలాంటి మోసాల గురించి చెప్పి, వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో వెలుగు చూసిన అక్రమాల తర్వాత ఇటువంటి సెంటర్లు నగరంలో చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి. వీటి పట్ల ట్రీట్ మెంట్ కోసం ఐవీఎఫ్ ఆసుపత్రులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular