పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సైబర్ పోలీసుల పేరిట దుండగులు ఓ వైద్యుడి నుంచి రూ.72 లక్షలు కాజేశారు. వైద్యుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి తమను తాము సైబర్ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు.మీ పేరిట ముంబయి నుంచి వచ్చిన పార్సిల్‌లో 5 పాస్‌పోర్టులు, ఏటీఎం కార్డులు, డ్రగ్స్ ఉన్నట్లు కొరియర్ సంస్థ నుంచి తమకు సమాచారం వచ్చిందని.. విచారణ నిమిత్తం పూర్తి వివరాలు చెప్పాలని పేర్కొన్నారు. తర్వాత అధికారుల పేరిట ఫోన్ చేసి బ్యాంకు ఖాతాల వివరాలు అడిగారు. వారు అధికారులేనని నమ్మిన బాధితుడు..
ఖాతాల నంబర్లు చెప్పారు. ఆ ఖాతాల్లో రూ.72 లక్షలు ఉన్నాయని.. తాము చెప్పిన ఖాతాకు బదిలీచేయాలని సూచించారు. ఎందుకని వైద్యుడు ప్రశ్నించగా ఇంత సొమ్ము మీకు ఎలా వచ్చిందో సరిచూడాలని తిరిగి మీ ఖాతాల్లో జమ చేస్తామని దుండగులు నమ్మబలికారు. తరువాత ఆ సొమ్ముంతా కాజేశారు. ఎంతకీ నగదు తిరిగి జమ కాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు