మత్తు కోసం యువత అడ్డదారులు తొక్కుతోంది. మందుల దుకాణంలో దొరికే సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలను విచ్ఛలవిడిగా వాడుతూ మత్తుకు బానిసవుతోంది. యువత బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాదకద్రవ్యాలు కాని ఇలాంటి మందుల విక్రయాలతో అక్రమ సంపాదనకు తెరతీశారు. డాక్టర్స్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు కలిగించే మాత్రలు విక్రయిస్తుండడంతో చాలా మంది యువకులు వాటిని వినియోగిస్తూ మత్తులో మునకలేస్తున్నారు. మద్యపానానికి, గంజాయికి ప్రత్యామ్నాయంగా రసాయనాలు, జెల్‌లు, మాత్రల వినియోగం ఇటీవల జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతోంది.
మచ్చుకు కొన్ని..
● హిందూపురంలోని శంకర్ మెడికల్స్‌లో గత ఏడాది డిసెంబర్ 21న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హనుమన్న, డీఎస్పీ మహేష్, సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వకూడని మందులను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతున్న ప్రాస్మో ప్రాక్స్ మందులను గుర్తించి సీజ్ చేశారు.
● ఈ నెల 21న డ్రగ్ ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్ అధికారులు హిందూపురంలోని పలు మెడికల్ స్టోర్లలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నిద్రమాత్రలు, నొప్పి తగ్గించే మాత్రలను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మూడు మెడికల్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
ప్రిస్కిప్షన్ లేకుండానే విక్రయాలు
హిందూపురం పట్టణంలో సుమారు 160కు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో చాలా వాటిలో డాక్టర్ ప్రిస్కిష్పన్ లేకుండానే మందులను విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో అయితే ఓ వ్యక్తి తనకు ఫలానా సమస్య ఉందని చెబితే చాలు వారే డాక్టర్లుగా మారి మందులను అంటకడుతున్నారు. ఇలాంటి వ్యవస్థీకృత ముఠాలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మత్తును కలిగించే మందులు, ట్రమడాల్, ఆల్‌ఫ్రాజోలమ్, ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్, నిద్రమాత్రలు తదితర మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా దొరుకుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ మాత్రలను యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ మత్తు కోసం వాడుతున్నట్లు సమాచారం
సంసారానికి పనికి రారు
మత్తును కలిగించే మాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తే యువతలోని సహజ శక్తిసామర్థ్యాలు సన్నగిల్లుతాయి. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ముఖ్యంగా సంసారానికి పనికిరాకుండా పోతారు. దుష్పరిణామాలపై ఎలాంటి అవగాహన లేకుండా మందులు ఉపయోగిస్తే ప్రాణాలతో చెలగాటమాడినట్లవుతుంది. వైద్యుల సలహా లేనిదే ఏ మాత్రలనూ వాడకూడదు.
– డాక్టర్ శివకుమార్, ప్రభుత్వాస్పత్రి వైద్యుడు
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్‌లు, సిరప్‌లను విక్రయించే మెడికల్ షాప్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టి కొన్నింటిని సీజ్ చేశాం. మరి కొందరికి నోటీసులు జారీ చేశాం. మత్తు కలిగించే మాత్రలు, ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్‌ను, శాంపుల్ డ్రగ్‌ను అమ్మరాదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మత్తు కోసం కొత్త పంథాను ఎంచుకున్న యువత.. గంజాయి, హెరాయిన్‌కు ప్రత్యామ్నాయంగా మెడికల్ స్టోర్‌లో దొరికే మందుల వినియోగం
RELATED ARTICLES