న్యాయవ్యవస్థలో ఎప్పటికప్పుడు కీలకమైన తీర్పులు వెలువడుతూనే ఉంటాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఒక మహిళ ఏడ్చినంత మాత్రాన అది వరకట్న వేధింపులకు రుజువు కాదని కోర్టు తెలిపింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఈ వ్యాఖ్యలు చేస్తూ.. వరకట్న వేధింపులు, క్రూరత్వం ఆరోపణల నుంచి భర్త, అతని కుటుంబ సభ్యులను విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ 2010 డిసెంబర్‌లో వివాహం చేసుకుని.. 2014 మార్చి 31వ తేదీన మరణించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులు ఉన్నాయని ఆరోపించారు. వివాహం కోసం ఇప్పటికే రూ.4 లక్షల వరకు ఖర్చు చేశామని.. అయినా మోటార్ సైకిల్, నగదు, బంగారు బ్రాస్‌లెట్ కోసం ఆమెను వేధించారని అత్తింటి వాళ్లు వేధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించలేదు. మహిళ మరణానికి సహజ కారణాలే (న్యుమోనియా) అని పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టంగా వెల్లడైంది. ఈ నివేదికను ట్రయల్ కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంది.
అందుకే కోర్టును కొట్టివేసింది. కానీ మృతురాలి తరఫు వాళ్లు హైకోర్టుకు వెళ్లారు. దీంతో న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈక్రమంలోనే ట్రయల్ కోర్టు ఇచ్చన తీర్పును సమర్థించింది. ముఖ్యంగా తన తీర్పులో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. కేవలం ఒక మహిళ ఏడిస్తే అది వరకట్న వేధింపులకు బలమైన సాక్ష్యం కాదని స్పష్టం చేసింది. ఏడుపు అనేది అనేక ఇతర కారణాల వల్ల కూడా ఉండవచ్చుని.. ఉదాహరణకు నిస్పృహ, ఆందోళన, ఇతర మానసిక ఒత్తిడి వల్ల కూడా ఒక మహిళ ఏడవచ్చని కోర్టు పేర్కొంది.”ఆమె కేవలం ఏడ్చిందని చెప్పడం, అదనపు కట్నం కోసం ఆమెను వేధించారని రుజువు చేయదు” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే మహిళ తండ్రి చేసిన వాదనల్లో ఏమాత్రం పస లేదని పేర్కొంది. అలాగే తమ కూతురు భర్త ఇంటిలో ఎదుర్కొన్న హింసకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను వారు సమర్పించలేక పోయారని గుర్తు చేసింది. ఈ తీర్పు న్యాయ నిపుణులు, సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. వరకట్న వేధింపుల నుంచి మహిళలను రక్షించడానికి చట్టాలు ఎంత అవసరమో.. వాటిని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఈ తీర్పు తెలియజేసింది. నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే, చట్టాలు దుర్వినియోగం కాకుండా ఉండాలని ఈ తీర్పు గుర్తు చేసింది.
మహిళ ఏడుపు వరకట్న వేధింపులకు సాక్ష్యం కాదు: ఢిల్లీ హైకోర్టు
RELATED ARTICLES