
కోబ్రా న్యూస్ ఎక్స్‌క్లూజివ్
మావోయిస్టు భావజాలాన్ని సమర్థిస్తూ, భద్రతా బలగాల ఎన్కౌంటర్లను “ఫేక్ ఎన్కౌంటర్లు”గా చిత్రీకరిస్తూ యూట్యూబ్ వేదికగా ప్రచారం చేసిన కేసులో తొలివెలుగు రఘుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా కోబ్రా న్యూస్కు పక్కా సమాచారం అందింది.
గాదె ఇన్నయ్య, మాజీ మావోయిస్టు కట్టా రామ్ చంద్రా రెడ్డిలతో చేసిన ఇంటర్వ్యూల వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన నేపథ్యంలో, రఘుతో పాటు మరో ఏడు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కూడా ఎన్ఐఏ చర్యలకు సిద్ధమవుతోంది. మావోయిస్టు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే విధంగా కంటెంట్ ప్రసారం చేయడమే నోటీసులకు ప్రధాన కారణమని సమాచారం.
ముందుగానే నిఘా – ఆధారాల సేకరణ
ఎన్ఐఏ ఇప్పటికే సంబంధిత యూట్యూబ్ ఛానళ్లపై నిఘా పెట్టి, ఇంటర్వ్యూలు, వీడియోల కంటెంట్, వ్యూస్, షేర్లు, కామెంట్లు, డిజిటల్ ట్రైల్ వంటి అంశాలపై విస్తృతంగా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని సమర్థించేలా, ప్రభుత్వ చర్యలను దుష్ప్రచారం చేసేలా ఉన్న వీడియోలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి.
హాజరు కావాలని ఆదేశం
నోటీసులు అందుకున్న వారు ఎన్ఐఏ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కంటెంట్ ఉద్దేశ్యం, నిధుల మూలాలు, ఇంటర్వ్యూల నిర్వహణ వెనుక ఉన్న నెట్‌వర్క్ వంటి అంశాలపై ప్రశ్నించేందుకు ఎన్ఐఏ సిద్ధమవుతోంది.
చట్టపరమైన చర్యలు
జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ప్రచారం, నిషేధిత సంస్థలకు మద్దతుగా భావించే కంటెంట్ అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఐటీ చట్టం, యూఏపీఏ తదితర నిబంధనల కింద కేసులు నమోదు చేసే దిశగా ఎన్ఐఏ ముందుకెళ్లనుంది.
ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా, మరిన్ని వివరాలతో కోబ్రా న్యూస్ ప్రత్యేక కథనాన్ని త్వరలో అందిస్తుంది.



