ఎవరికైనా న్యాయం కావాలంటే వారి తరపున కేసు వాదించాల్సిన న్యాయవాదే ఓ కేసులో ముద్దాయిగా మారిన ఘటన కేరళలో జరిగింది. ఓ సీనియర్ ప్రభుత్వ న్యాయవాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కారణంగా అరెస్ట్ అయ్యారు.
బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఎర్నాకుళానికి చెందిన 25 ఏళ్ల మహిళ, 2018లో రేప్ కేసు బాధితురాలిగా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వ ప్లీడర్ పీజీ మను వద్దకు వెళ్లింది.
అయితే, దీన్ని అలుసుగా తీసుకున్న లాయర్, ఆమెను లైంగికంగా వేధించాడు. వేధింపులకు పాల్పడ్డమే కాకుండాఅమె ఫోటోలు కూడా తీశాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. కేసు విషయమై చర్చించే నెపంతో పలుమార్లు పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధిత మహిళ పేర్కొంది. వేధింపులు భరించలేక ఆమె తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో మనుపై కేసు నమోదైంది. ఉన్నతాధికారుల సూచన మేరకు న్యాయవాది మను తన ఉద్యోగానికి రాజానామా చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. పీజీ మను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి న్యాయవాదిగా ఉన్నారు.




