యాప్ పేరుతో బూతు దందా – యూజర్లను వలలోకి లాగుతున్న ముఠా
కోబ్రా న్యూస్ ప్రత్యేక కథనం
ఇటీవల దేశీయ టెక్నాలజీతో రూపొందిన ఓ యాప్ వేగంగా పాపులర్ అయింది. వాట్సాప్‌కు ధీటుగా కమ్యూనికేషన్ సదుపాయాలు అందిస్తోందని యూజర్లు ఆదరిస్తున్నారు. అయితే, ఇదే యాప్ ఇప్పుడు బూతు దందాకు వేదికగా మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
యాప్‌లో యూజర్లకు నేరుగా మెసేజ్‌లు పంపుతూ “మీకు ఏమి కావాలి, ఎంత సమయం కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి” అంటూ పోస్టులు పెడుతున్నట్లు సమాచారం. ఆ మెసేజ్‌లతో పాటు కొన్ని వీడియోలు కూడా షేర్ చేయడంతో యూజర్లు త్వరగా ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆ యాప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యాప్‌ను ఉపయోగిస్తున్న వారు ఇలాంటి మెసేజ్‌లకు ఆకర్షితులు కావద్దంటూ హెచ్చరికలూ వెల్లువెత్తుతున్నాయి.
ఇదే యాప్‌లో ఓ యూజర్‌కు “సునీత” అనే మహిళ పేరుతో మెసేజ్ వచ్చిందని సమాచారం. అందులో నగ్న ఫొటోలు, వీడియోలు, లైవ్ వీడియో కాల్స్‌కు రేట్లు పేర్కొంటూ పోస్టులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. నచ్చకపోతే నంబర్ బ్లాక్ చేయమని, టెలిగ్రామ్‌లో ఉన్న ఇతర మహిళల నంబర్లు కూడా షేర్ చేస్తానని పేర్కొనడంతో అనుమానం పెరిగింది. తనకు సంబంధించిన స్కానర్, ఇతర వీడియోలను కూడా ఆమె పోస్టు చేసినట్లు తెలిపాడు.
ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఆ యూజర్ పోలీసుల దృష్టికి, మీడియా దృష్టికి విషయం తీసుకొచ్చి ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని కోరారు. గతంలో అంబర్‌పేటలో వెలుగులోకి వచ్చిన న్యూడ్ వీడియో వ్యవహారాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో ‘నమస్తే తెలంగాణ’లో వార్త రావడంతో సంబంధిత దంపతులు అరెస్టు అయ్యారని పోలీసులు గుర్తు చేశారు.
తాజాగా వైరల్ అవుతున్న ఈ బూతు దందా వెనక పెద్ద ముఠా పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి యాప్‌ల ద్వారా వచ్చే బూతు మెసేజ్‌లను నమ్మితే మొదట నమ్మించి, ఆ తర్వాత నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో మెసెంజర్ యాప్‌ల ద్వారా కూడా చాలామంది ఇలాగే మోసపోయిన ఘటనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేయాలని, ఫొటోలు లేదా వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
— కోబ్రా న్యూస్




