సినిమాల్లో చూసినట్లు.. కూరగాయలు అమ్మేవారిగానో… చెత్త ఏరుకునేవారిగానో.. పనివాళ్లగానో మారువేషాల్లో నిఘా అధికారులు.. ఎన్ని రోజులైనా.. ఎంత కష్టమైనా..పరిస్థితులు అనుకూలించేవరకు పడిగాపులు.. మూడో కంటికి తెలియకుండా.. అత్యంత నమ్మకంగా.. ఏమాత్రం అనుమానం రాకుండా పక్కా ఏర్పాట్లు.. కరుడుగట్టిన నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారులు చేసే మహా ప్రయత్నం ఇది.. అచ్చం ఇలాంటిదే తెలుగు రాష్ట్రాల్లోని ఓ పట్టణంలో చోటుచేసుకుంది. బహుశా ఇటీవలి కాలంలో మనం ఎప్పుడూ విని ఉండని.. టాస్క్ ను అత్యంత చాకచక్యంగా పూర్తి చేశారు ఐబీ అధికారులు.
బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ హోం మంత్రి అయిన ఎల్ కే ఆడ్వాణీ జీవితం మనందరికీ తెరిచిన పుస్తకమే. 1990ల ప్రారంభంలో ఆడ్వాణీ చేపట్టిన రథయాత్రతోనే బీజేపీ ఇప్పుడు ఈ స్థాయికి రాగలిగింది. ఇక రథయాత్రలతోనే ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ప్రధాని కాలేదన్న ఒక్క లోటు తప్పితే ఆడ్వాణీకి మరే లోటు లేదు అనుకోవాలి. ఆపై స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో ఆయన విడదీయరాని వారు అయ్యారు. కాగా, ఆడ్వాణీ చేపట్టిన రథయాత్రలు తీవ్ర సంచలనం రేపాయి. ఆయనను బిహార్ లో అడుగుపెట్టనీయకుండా అప్పటి సీఎం లాలూప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. ఇక ఆడ్వాణీ తమిళనాడులోని కోయంబత్తూరులో తలపెట్టిన బహిరంగ సభకు ముందు బాంబు పేలుళ్లు సంభవించాయి.
మరోవైపు మదురైలో కొన్ని ఏళ్ల కిందట ఆడ్వాణీ రథయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై బాంబు పేలుళ్లకు కొందరు కుట్ర పన్నారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన సోదరులు అబూ బకర్ సిద్ధిఖీ, మొహమ్మద్ అలీ ప్రధాన నిందితులు. అయితే, వీరు ఇతర బాంబు పేలుళ్ల కేసులోనూ నిందితులు. పేలుళ్లకు పాల్పడిన తర్వాత ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటికి వచ్చారు. పేరు మార్చుకుని 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు రాయచోటిలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై ఐబీ అధికారులు ఈ ప్రాంతలోనే మకాం వేశారు. రెండు నెలల పాటు మారువేషాల్లో తిరిగారు. అనుమానితులపై నిఘా పెట్టి ఎట్టకేలకు వారిని అరెస్టు చేశారు.
సినిమా పక్కీలో..2 నెలలు మఫ్టీలో..రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టివేత
RELATED ARTICLES