ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ టెక్నాలజీ కారణంగా పెద్ద రిస్కులు కూడా ఉన్నాయి. కొంతమంది సైబర్ క్రిమినల్స్ సామాన్యులను మోసం చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కేటుగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఒక కొత్త, చాలా ప్రమాదకరమైన మార్గాన్ని కనుక్కున్నారు. ఏకంగా సామాన్యుల వేలిముద్రల (Fingerprints)ను దొంగిలిస్తున్నారు.
స్కామర్లు ఇంటర్నెట్ యూజర్ల వేలిముద్రలు తీసుకున్న తర్వాత, వారి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బును ఈజీగా కాజేయగలుగుతున్నారు. హ్యాకర్లు ఈ కొత్త మెథడ్ ద్వారా చాలామందిని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో యూజర్లు చిన్న తప్పు చేసినా వారి దగ్గర ఉన్నంత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది.
హ్యాకర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే ఫొటోల నుంచి ఫింగర్‌ప్రింట్స్ దొంగలిస్తున్నారు. ఆ ఫొటోల నుంచి ప్రజల ఫింగర్‌ప్రింట్స్ కాపీ చేసి, వాటిని ఉపయోగించి మోసం చేస్తున్నారు. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇతరుల సోషల్ మీడియా అకౌంట్స్‌లోని మీడియా కంటెంట్ యాక్సెస్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ ఉండే సోషల్ మీడియా యూజర్ల ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకుని, వాటి నుంచి వేలిముద్రలను కాపీ, ‘క్లోన్’ (Cloned fingerprints) చేయగలుగుతున్నారు. ఇందుకు AI టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు.
ఈ క్లోన్డ్ ఫింగర్‌ప్రింట్స్ ఉపయోగించి బయోమెట్రిక్ డేటా క్రియేట్ చేయగలుగుతారు. ఆధార్ నంబర్ కూడా వారికి తెలుస్తుంది. తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (Aadhaar Enabled Payment System) ద్వారా ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంకు అకౌంట్స్ నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తున్నారు. నేరస్థులు బాధితుడి వేలిముద్ర ఫింగర్‌ప్రింట్ కాపీ క్రియేట్ చేయడానికి సిలికాన్ ఆధారిత రబ్బరు పాలను కూడా ఉపయోగిస్తారు. పేమెంట్ అప్లికేషన్ల ద్వారా కూడా ఈ ఫింగర్‌ప్రింట్స్‌తో డబ్బులు కాజేస్తారు.
ఇలాంటి స్కామ్ నుంచి బయటపడేదెలా?
ఈ కొత్త స్కామ్‌ను బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సేఫ్టీ కోసం డివైజ్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలి. డివైజ్‌ను ఇల్లీగల్‌గా ఎవరూ యాక్సెస్ చేయకుండా టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ ఆన్ చేయాలి.
సోషల్ మీడియాలో వేలిముద్రలు స్పష్టంగా కనిపించే ఫొటోలను పెట్టకూడదు. లేదా ఫొటోల క్వాలిటీని తగ్గించాలి. ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంకు అకౌంట్‌ను తరచూ చెక్ చేయాలి. తెలియని లింక్స్, మెయిల్స్‌ను క్లిక్ చేయకూడదు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి, వాటిని తరచుగా మార్చాలి.