దేశంలో అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం బయటకు వచ్చింది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన దాదాపు 2600కోట్ల రికార్డులు బయటపడ్డాయి. ఎక్స్ , లింక్డిన్ వంటి ప్రముఖ వెబ్ సైట్ల యూజర్ల వివరాలు అందులో ఉన్నాయి.
సురక్షితం కాని ఓ వెబ్ సైట్లో అతిపెద్ద డేటాబేస్ ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అందులో దాదాపు 2600కోట్ల రికార్డులు ఉన్నట్లు సమాచారం. చరిత్రలోనే ఇప్పటివరకు చోటుచేసుకున్న అతిపెద్ద డేటా లీక్ ఇదేనని ఫోర్బ్స్ కథనం వెల్లడించింది. దాదాపు 12 టెరాబైట్ల డేటా లీక్ అయ్యిందని సెక్యూరిటీ డిస్కవరీ అండ్ సైబర్ న్యూస్ పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను సైబర్ నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్ చేయడం, సైబర్ దాడులు, మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ట్విట్టర్, ఎక్స్ , లింక్డిన్, డ్రాప్ బాక్స్ వంటి పలు ప్రముఖ వెబ్ సైట్లలోని యూజర్ల పర్సనల్, సెన్సిటివ్ సమాచారం ఈ డేటాబేస్ లో ఉన్నాయి. చైనా మెసేజింగ్ దిగ్గజం టెన్సెంట్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం వైబోతోపాటు అడోబ్ కాన్వా, టెలిగ్రామ్ వంటి వెబ్ సైట్లను ఉపయోగించే యూజర్ల రికార్డులూ కూడా లీక్ అయినట్లు ఫోర్బ్స్ కథనం వెల్లడించింది. అమెరికాతోపాటు పలు ప్రభుత్వ సంస్థల రికార్డులు అందులో బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అందుకే ఎప్పటికప్పుడు అవసరమైన సెక్యూరిటీ అప్ డేట్స్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ సలహాదారులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి భారీ డేటా లీక్ ఘటనలు ఎన్నో జరిగాయి. 2019లో ఓ అన్ సెక్యూర్డ్ వెబ్ సైట్లో 100కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయి. అంతకు ముందు 2013లో యాహూ యూజర్లకు సంబంధించిన 300కోట్ల వివరాలూ లీక్ అయ్యాయి.