ఇంటర్నెట్ యుగంలో అంత ఆన్లైన్ పేమెంట్స్ ఫైనాన్షియల్ పేమెంట్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలకు అవగాహన పెరిగే కొద్దీ స్కామర్లు తెలివి మీరుతున్నారు మరింత అడ్వాన్స్‌డ్‌గా, పూటకో రీతిలో అన్నట్లు ఫైనాన్షియల్ పేమెంట్ స్కామ్‌లకు తెగబడుతున్నారు. ప్రజలు, వ్యాపారులు ఇలా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ‘క్విషింగ్’ అనే స్కామ్ బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది కూడా ఫిషింగ్‌కి ఓ రూపం.
క్విషింగ్ అనే పేరు క్యూఆర్, ఫిషింగ్ అనే రెండు పదాల నుంచి వచ్చింది. ఫిషింగ్ అనేది చట్టబద్ధమైన సంస్థగా నటిస్తూ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా ఇతర సెన్సిటివ్ డేటా వంటి పర్సనల్ ఇన్‌ఫర్మేషన్ దొంగిలించే మోసపూరిత ప్రయత్నం. ఇది క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి పర్సనల్ ఇన్‌ఫర్మేషన్ సేకరిస్తుంది. తర్వాత మాల్వేర్‌ను డౌన్‌లోడ్ చేసి యూజర్లను మోసం చేస్తుంది. ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? ఎలా జాగ్రత్త పడాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.
స్కామర్లు నకిలీ క్యూఆర్ కోడ్‌లను క్రియేట్ చేస్తారు. వాటిని చట్టబద్ధమైన వెబ్‌సైట్లకు లింక్‌లుగా లేదా ఆకర్షణీయమైన ఆఫర్లుగా మారుస్తారు. ఈ క్యూఆర్ కోడ్‌లను స్టిక్కర్లు, పోస్టర్లపై ఉంచవచ్చు లేదా పబ్లిక్ ప్లేస్‌లలో నిజమైన కోడ్‌లపై కూడా అతికించవచ్చు.
దీన్ని ఎవరైనా స్కాన్ చేస్తే, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించిన హానికరమైన వెబ్‌సైట్‌కి దారి మళ్లిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ డివైజ్‌లోకి డౌన్‌లోడ్ కావచ్చు. ఈ మాల్వేర్ సాయంతో మోసగాళ్లు సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేస్తారు లేదా డివైజ్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయగలరు.
* క్యూఆర్ ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడకుండా చిట్కాలు*
1) తెలియని క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేసే ముందు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా తెలియని లేదా అనుమానాస్పద సోర్సెస్ నుంచి రిసీవ్ చేసుకున్న క్యూఆర్ కోడ్‌లు నమ్మకూడదు.
2) స్కాన్ చేయడానికి ముందు విశ్వసనీయమైన క్యూఆర్ కోడ్ రీడర్ యాప్‌ను ఉపయోగించి క్యూఆర్ కోడ్‌లో ఎన్‌కోడ్ చేసిన డెస్టినేషన్ లింక్‌ను వెరిఫై చేయండి.
3) నకిలీ క్యూఆర్ కోడ్‌ని సూచించే అస్పష్టమైన(బ్లర్రీ) లేదా తప్పుగా అమర్చిన కోడ్(మిస్ అలైన్డ్ కోడ్)ల వంటి ట్యాంపరింగ్ సైన్స్ కోసం చూడండి.
4) ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయండి. కచ్చితంగా తెలియకుంటే ఉద్దేశించిన ప్రొవైడర్‌తో వాటి చట్టబద్ధతను వెరిఫై చేయండి.
5) లింక్‌ను ప్రివ్యూ చేయడానికి సెక్యూర్ క్యూఆర్ కోడ్ రీడర్ యాప్‌ను ఉపయోగించండి. స్కాన్ చేసే ముందు ప్రమాదాల గురించి ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
6) వ్యక్తిగత లేదా ఆర్థిక డేటా రాజీ పడకుండా ఉండటానికి క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే వెబ్‌సైట్‌లలో ఎలాంటి డీటైల్స్ ఎంటర్ చేయకండి.