గ్యాంగ్ స్టర్ నయిమ్ ఆస్తులు ఎక్కడ… వాటిని జప్తు చేసిన అధికారులు ఎక్కడ దాచారు.. ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో దర్యాప్తు అంశం ఎక్కడి వరకు చేరింది. ఆ ఆస్తులు ఇప్పుడు ఎవరి వద్ద ఉన్నాయి.. ఈ కేసులో అప్పటి సిట్ ఇచ్చిన నివేదికలో నిజా నిజాలు దాగి ఉన్నాయా… ఎన్ కౌంటర్ తరువాత నయిమ్ ఎపిసోడ్ కి ఎందుకు ముగింపు పడింది. ఇప్పడు అన్ని ఇవే ఆలోచనలు.. మరోసారి కేసులు తిరగతోడే పనిలో పోలీస్ బాస్ లు నిమగ్నమైనారు.
గ్యాంగ్ స్టర్ నయిమ్ ఆస్తులు ఎమైనాయి.. అప్పుడు దర్యాప్తు చేసిన సిట్ దగ్గరే ఉన్నాయా… జప్తు చేసిన వాటిని ఎవరికి అప్పగించారు. నానా హడావిడిగా సాగిన కేసు ఇన్వెస్టిగేషన్ కి ఫుల్ స్టాప్ ఎందుకు పడింది. దీని వెనుకాల ఎవరు ఉన్నారు. ఛార్జ్ షీట్ లో ఉన్నవారు ఇప్పుడు ఎమ్ చేస్తున్నారు… ఆరోపణలు ఎదురుకొన్న అప్పటి కొందరు పోలీస్ అధికారులకు ప్రభుత్వం ఎందుకు క్లిన్ చిట్ ఇచ్చింది. అరెస్ట్ ఐ బెయిల్ మీద వచ్చిన వారు ఏం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ బడా బాస్ లకు ఇవే ఆలోచనలు తలెత్తుతున్నాయి. మరోసారి నయిమ్ ఫైల్ తెప్పించుకున్న అధికారులు దాన్ని స్టడీ చేసే పనిలో పడ్డారు. 2016 నుండి రెండేళ్లపాటు స్పీడ్ గా సాగిన దర్యాప్తుకు బ్రేక్ ఎందుకు పడింది. ఎనిమిదేళ్లుగా ఈ కేసులో అధికారులు సాధించింది ఏంటి అనే విషయాలపైనే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
గ్యాంగ్ స్టర్ నయిమ్ ఆస్తుల జప్తుకు మొదటి విడతగా 140 కోట్ల ఆస్తుల జప్తుకు అప్పటి సిట్ రంగం సిద్దం చేసింది. ఇందు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బినామీ పేర్లతో నయిమ్ కూడబెట్టిన ఆస్తుల చిట్టాను సేకరించిన సిట్ వాటికి సంబంధించిన ఆధారాలన్ని కూడబెట్టింది. ప్రభుత్వం నుండి గ్రీన్ స్నిగల్ రావడంతో నయిమ్ నేర సామ్రాజ్యంలో సంపాదించిన సొత్తు మొత్తం టివి సీరియల్ తరహాలో ఎపిసోడ్ ల మాదిరిగా జప్తు చేసేందుకు రెడీ అయ్యింది. ఆధారాలు లేని ఆస్తుల విషయంలో సిట్ మరోసారి కసరత్తు చేసింది. ప్రత్యేక బాధితుల కౌంటర్ తెరిచి మొత్తం నాలుగువేల కోట్లకు పైగానే నయిమ్ దోచుకుని దాచుకున్నట్లు తెలుసుకుంది.
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల జప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను గుర్తించి వాటిని స్వాదీనం చేసుకున్నారు. నయీమ్.. తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెటైనట్లు తెలుసుకున్నారు. మార్కెట్ విలువను పరిశీలిస్తే… హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ 5 కోట్లుగా పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ 35 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్‌లో 5 కోట్ల విలువైన వెంచర్.
నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ 3.5 కోట్లు. మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు 12 కోట్ల నుంచి 18 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇల్లు గుర్తించారు. ఒక్కో ఇంటిని 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు.
నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్‌మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్‌ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు 6 కోట్లు.
నార్సింగిలో 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్ విలువ 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ 3.5 కోట్లు.
మేడ్చల్‌లో 3 ఎకరాలు, శామీర్‌పేట్‌లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజాప్రతినిధితో చేసిన సెటిల్‌మెంట్‌లో పొందిన ఈ భూమి విలువ సుమారు 20 కోట్లు. మొయినాబాద్‌లో ఒక్కోటి 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ల్యాండ్ సెటిల్‌మెంట్‌తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది.అలాగే ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. నయీమ్ మొత్తం 1,130 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా, ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడ్డారు. 15 ఏళ్ల క్రితం జరిగిన సెటిల్‌మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం పోలీసులకు ఇబ్బంది ఎదురైంది.
ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ నయిమ్ ఆస్తులు చిట్టా సేకరించిన వాటిని ఎక్కడ కూడా చూపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2016 నుండి 2024వరకు ఆ కేసు అటకెక్కడానికి గల కారణాలు అధికారులు అన్వేషిస్తున్నారు. అయితే నయిమ్ ఆస్తులు అన్ని అప్పటి బడా నేతల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపణలు అనేకం ఉన్నాయి. అందుకే ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు ఆ వత్తిడి తట్టుకోోలేక కేసుపై చేతులు ఎత్తేశారన్న సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా.. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులు ఫోన్ ట్యాపింగ్, కల్వకుంట్ల కన్నారావు భూ కబ్జా, టానిక్ వైన్స్ అనుమతులు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ప్రమాద ఘంటికలు ఇలా ఒక్కో కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ఇప్పటి పోలీస్ బాస్ లు నయిమ్ కేసు ఫైల్ ను తెప్పించి దుమ్ముదులిపే పనిలో పడినట్లు వినికిడి. నయిమ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి. ఎవరికి ఎంతెంత చేరాయి.. అవి రాబట్టే పనిలో ఉన్నట్లు సమాచారం . ఏళ్లుగా నిశబ్దంగా మారిన ఈ కేసు మరోసారి తెరమీదకు వస్తే ఖచ్చితంగా ఓ రాజకీయపార్టీలో అలజడి రేగడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ నయిమ్ ఆస్తులు 4000 వేళ కోట్లు ఎక్కడ..
RELATED ARTICLES