ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని (Artificial Intelligence) ఉపయోగించుకొని ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇదే తరహా మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వాయిస్‌ను సృష్టించి ఓ వ్యాపారవేత్తను మోసం చేశారు. ఈ ఘటన ఆధారంగా ఏఐ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతే ఇబ్బందులు ఉన్నాయని గుర్తుచేస్తుంది.ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తకు దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ పేరిట ఒక ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్‌లోని ఉన్న కుమారుడు అరెస్ట్ అయ్యాడని, జైలు శిక్ష విధించారని ఆ కాల్ సారాంశం. అయితే ఆ వ్యాపారవేత్తను నమ్మించేందుకు కుమారుడి వాయిస్ తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా నకిలీ వాయిస్‌ను (Voice Cloning) సృష్టించి, మాట్లాడించారు.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వెంటనే రూ.80,000 చెల్లించాలని సూచించారు. అయితే ఇదంతా నమ్మిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త… తన కుమారుడితో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నం చేయలేదు. మరియు రాయబార కార్యాలయాన్ని సంప్రదించలేదు. సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేయమని తన కార్యాలయ సిబ్బందికి సూచించాడు.
అయితే నగదును బదిలీ చేసిన తర్వాత కుమారుడిని సంప్రదించాడు. అప్పుడు అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయానని గుర్తించిన వ్యాపారవేత్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు వివరాల ఆధారంగా నేరస్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.వాయిస్ క్లోనింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వ్యక్తుల నకిలీ వాయిస్‌ను సృష్టించడం. అయితే ఇలాంటి నకిలీ కాల్స్‌ను గుర్తించడం అంత సులభం కాదు. ఇలాంటి వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్లు ప్రస్తుతం అనేకం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ?
అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భంలో ఆందోళన చెందకుండా కాల్‌లోని సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. స్నేహితులు లేదా సంబంధిత అధికారులకు సమస్యను వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవచ్చు. అయితే మీకు వచ్చిన కాల్ యొక్క ఫోన్ నంబర్‌పై ఆధారపడొద్దు.
ముఖ్యంగా అత్యవసరం మరియు ఆపదలో ఉన్నామనే మాట చెప్పి నగదు బదిలీ చేయమని కోరే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాలర్ వివరాలు కచ్చితంగా తెలియని పరిస్థితుల్లో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలను తెలియజేయవద్దు. దీంతోపాటు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.