తాజాగా ఒక కిలాడీ లేడీ వాట్సాప్ ద్వారా చిన్నారులను అమ్మకానికి పెడుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. చీరలు, వస్త్రాల వ్యాపారం ముసుగులో ఈ అక్రమాలకు పాల్పడుతోంది.గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఒక వ్యక్తికి వాట్సాప్ లో కిలాడీ లేడీ ఒక ఆఫర్ పెట్టింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంతానం లేని డబ్బున్న వారిని, కుటుంబాన్ని పోషించలేని దంపతులను టార్గెట్ చేస్తోంది. కుటుంబాన్ని పోషించలేని వారివద్ద నుంచి చిన్నారులను తీసుకొని, సంతానం లేని వారికి అమ్ముతోంది. సోషల్ మీడియా ద్వారా పసికందుల ఫొటోలను పంపి అమ్మకం, కొనుగోళ్లను గుట్టుగా చేస్తోంది. ఈ వ్యవహారం బుధవారం బయటపడింది.
తాడేపల్లి మండలంలోని నులకపేటలో సామ్రాజ్యం అనే మహిళ చీరలు, వస్త్రాల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా ఉండే మహిళలను పరిచయం చేసుకుంటుంది. ఒక వ్యక్తితో సహజీవనం చేస్తూ నులకపేటలో ఉంటోంది. తాము భార్యా భర్తలుగా స్థానికులను నమ్మించింది. ఈ నేపథ్యంలో కొంతమంది సంతానం లేని దంపతులకు, కుటుంబ పోషణ సరిగాలేని వారిని టార్గెట్‌గా చేసుకొని వారి ఫోన్ నెంబర్లను తీసుకుంటుంది. చిన్నారుల, పసికందుల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపించి, చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు గుట్టుగా సాగిస్తోంది. తమ వద్ద చిన్నారులు ఉన్నారని, ఒక్కో చిన్నారి నాలుగు, ఐదు లక్షల రూపాయలకు అమ్మకానికి పెడుతోంది. అవసరమైన వారు ఎవరైనా ఉంటే, తనకు సమాచారం ఇవ్వాలని పేర్కొంటుంది. ఇలా ఒక వ్యక్తికి వాట్సాప్‌లో చిన్నారుల ఫొటోలు పంపించింది. దీంతో గుట్టురట్టు అయింది.