గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంజినీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ లో ఏకంగా 28 కెమెరాలు పెట్టి..
300 వీడియోలు రికార్డ్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. కాలేజ్ లో విద్యార్థినులు మొత్తం ధర్నాకు దిగారు. వానను సైతం లెక్కచేయకుండా తమకు న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. కాలేజ్ లో చదువుకుంటున్న అమ్మాయిలు భయంతో కంగారు పడుతూ.. ఒకరితో ఒకరు చేసుకున్న వాయిస్ చాట్ అంటూ ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ ఆడియోలో ఒక అమ్మాయి చచ్చిపోవాలి అనిపిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అసలు ఆ ఆడియో క్లిప్ లో ఏం ఉంది?.. “అమ్మాయి ఫోర్త్ ఇయర్ అని తెలిసింది. ఆమె ఫొటో కూడా చూశాను. అక్క ఏం అనట్లేదు.. రండి చూసుకుందాం అంటోంది. ఆధారాలు కూడా ఉన్నాయి అంటోంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ అని ఏదోదో అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. మేడమ్ వార్డెన్స్ కర్రలతో కొడుతున్నారు. 300 వీడియోలో, రెండు నెలల నుంచి జరుగుతోంది అంటున్నారు. చచ్చిపోవాలి అనిపిస్తోంది. ఏదేదో చెబుతున్నారు. ఫేక్ న్యూస్.. చూసి చెప్తాం అంటున్నారు. ప్లీజ్ ఎవరి దగ్గరైనా వీడియో ఉందేమో కనుక్కోండి. వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారు అంట. లేకపోతే పట్టించుకోరు అంట. ఏడుపొచ్చేస్తోంది. మా ఫ్లోర్ లోనే కెమెరా దొరికింది అంట. వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారు అంట. అడిగితేనే కర్రలు పెట్టి కొడుతున్నారు. హాస్టల్ లో అందరూ ఏడుస్తున్నారు” అంటూ ఆ వైరల్ ఆడియో క్లిప్ లో ఉంది
అసలు ఏం జరిగిందంటే?:
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈ సీక్రెట్ కెమెరాల ఘనట కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజాముకు ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల హాస్టల్ బాత్ రూమ్స్ లో కెమెరాలు పెట్టి.. వీడియోలు చిత్రీకరించి.. వాటిని అమ్ముతున్నారు అంటూ ఒక విద్యార్థిపై ఆరోపణలు కూడా వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. అతను బెదిరించడంతోనే ఫోర్త్ ఇయర్ కి చెందిన యువతి కెమెరాలు పెట్టింది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ లో కూడా ఫోర్త్ ఇయర్ అమ్మాయి కెమెరాలు పెట్టింది అంటూ వివరాలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.