మంచిర్యాల జిల్లా లో నివసించే ఎన్ శ్రీకాంత్ (29) ప్రైవేట్ లోన్‌యాప్‌లో సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఒక నెల ఈఎంఐ కట్టకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఓ వైపు అప్పటికే చేసిన కొన్ని అప్పులు తీర్చలేక, మరోవైపు లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక శ్రీకాంత్ గత నెల 24న సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియాలో లోన్ యాప్స్ మళ్లీ పడగ విప్పుతున్నాయి. వాటి నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలవేసి, తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ఎంతో మందిని, ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకుంటున్నారు. ఎలాంటి షరతులు పెట్టకుండానే అప్పులు ఇస్తున్నారు. వారి నుంచి రుణాలు తీసుకున్నవారు ఈఎంఐ చెల్లించడంలో ఒక్కరోజు ఆలస్యమైనా ప్రాణాలు తోడేస్తున్నారు
పదే పదే అవే యాడ్స్
అనధికారిక లోన్‌యాప్స్ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వాటిని ఎవరైనా చూసినా, చదివినా, లైక్ చేసినా.. పదే పదే అలాంటి యాడ్స్‌తో కవ్విస్తున్నాయి. తక్కువ వడ్డీని ఆశచూపుతూ లోన్ తీసుకునేలా టెంప్ట్ చేస్తున్నాయి. ఆర్థిక అవసరాల కోసం వాటి వలలో పడి ఒకసారి లోన్ ప్రాసెస్ మొదలుపెడితే సమస్యలను ఆహ్వానించినట్టే. ప్రతి దశలోనూ వారికి మన ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అనుమతులు ఇస్తూనే ఉండాలి. లేకపోతే లోన్ ప్రాసెస్ ముందుకెళ్లదు. ఇలా మన కాంటాక్ట్స్, ఫొటోలు, రికార్డింగ్ వీడియోలు, వాయిస్ రికార్డింగ్‌లు, లొకేషన్, కెమెరా పర్మిషన్స్, ఫోన్‌లోని ఇతర యాప్స్ పర్మిషన్స్ అన్నీ వారి గుప్పిట్లోకి తెచ్చుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ ఫీజులతో కలిపి డబ్బులు మన అకౌంట్‌లో జమ చేస్తారు.
వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు
లోన్ యాప్స్ నిర్వాహకులకు ఈఎంఐ చెల్లింపు ఒక్కరోజు ఆలస్యమైనా మన కాంటాక్ట్ లిస్టులోని బంధువులకు ఫోన్లు చేస్తుంటారు. మన ఫోన్ గ్యాలరీలోని ఫొటోలను మార్ఫింగ్ చేసి మిత్రులకు, బంధువులకు పంపుతుంటారు. తీసుకున్న అప్పు చెల్లించడం చేతకాని వాడంటూ మనపై ముద్రవేస్తారు. దీంతో పరువు పోయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 32 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సైబర్ నిపుణులు చెప్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలేవి?
మానసికంగా వేధించి ఎంతో మంది ప్రాణాలను తోడేస్తున్న లోన్ యాప్స్ నిర్వాహకులపై, సోషల్ మీడియాలో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఈ దారుణలపై దృష్టిపెట్టడం లేదు. దీంతో లోన్ యాప్‌ల ఆగడాలు నానాటికీ పెచ్చరిల్లుతున్నాయి