భారతీయుల పరువును కొందరు విదేశాల్లోనూ తీస్తున్నారు. ఇక్కడి బ్యాంకులను కొందరు మోసగిస్తుంటే.. మరికొందరు విదేశాల్లోని బ్యాంకులకు కన్నం వేస్తున్నారు.తాజాగా బయటపడిన ఒక కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ పరువు తీస్తోంది.
వివరాల్లోకి వెళితే కువైల్ బ్యాంకులో భారతీయులు చేసిన పెద్ద కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని విలువ అక్షరాలా రూ.700 కోట్లు కావటం గమనార్హం. ఇందులో దాదాపు 1425 మంది హస్తం ఉన్నట్లు వెల్లడికావటంతో భారతదేశంలోనూ పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇదంతా చేసింది మళయాలీలని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అసలు ఇందులో ప్రధాన నేరస్థులు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఒకప్పటి నర్సులని తేలింది. తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లుగా వ్యవహారం బయటకు రావటంతో మహా కుంభకోణం వెలుగుచూసింది.
ఈ మళయాళీ నర్సులు బ్యాంక్ నుంచి ఒక్కొక్కరు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రుణాలుగా పొందారు. అయితే వీటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకునేందుకు అమెరికా, కెనడా, యూఏఈ సహా మరిన్ని దేశాలకు పారిపోయినట్లు దర్యాప్తు చేసిన అధికారులు గుర్తించారు. దీంతో కువైట్ బ్యాంకు పెద్ద నష్టాన్ని చవిచూసింది. రుణాలు పొందిన వ్యక్తుల నుంచి ఈఎంఐ చెల్లింపులు జాప్యం కావటంతో బ్యాంక్ అప్రమత్తం అయ్యింది. దీనిపై చేస్తున్న దర్యాప్తులో బ్యాంక్ సిబ్బంది ఇలాంటి మరింత మంది రుణదాతల వివరాలను గుర్తించారు.కేరళ పోలీసులతో పాటు బ్యాంకు అధికారులు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను వీరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంక్ ఆఫ్ కువైట్‌లో పనిచేస్తున్న ఏజెంట్లు నిందితులకు సహకారం అందించి ఉంటారనే కోణంలోనూ ప్రస్తుతం అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై ఇండియాలోని కొట్టాయం, ఎర్ణాకుల జిల్లాల్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కానీ అసలు ఈ రుణాల కుంభకోణం ఎంత పెద్దదనే విషయం బయటపడుతుందని పోలీసులు, బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.