తమిళనాడు (TamilNadu) రాజధాని చెన్నైలోని (Chennai) అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి కేసు (Anna University Sexual Assault Case) ప్రకంపనలు సృష్టిస్తోంది.కేసు దర్యాప్తులో పోలీసుల తీరు, రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఒక హెచ్చరికగా భావించకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడింది. విద్యార్థినిపై లైంగిక దాడికి నిరసనగా ఆందోళన చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారంటూ పట్టలి మక్కల్ కట్చి (PMK) పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పి.వేల్‌మురుగున్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌లో రాజకీయ కోణం తప్ప.. బాధితురాలికి న్యాయం చేయాలన్న తపన కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు నిరసనలను ఉపయోగించుకుంటున్నాయని, అందులో నిజాయితీ ఉండటంలేదని జస్టిస్ వేల్‌మురుగన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.