నేరగాళ్లు (cyber scam) రోజురోజుకి పేట్రేగిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని భారీఎత్తున నగదు కొట్టెస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ రూ. కోటికి పైగా కోల్పోయింది.
ముంబయికి చెందిన ఓ మహిళ (78) అమెరికాలో ఉంటున్న తన కుమార్తె కోసం కొన్ని ఆహార పదార్థాలతో పాటు మరి కొన్ని వస్తువులు పంపేందుకు ఓ కొరియర్ సర్వీసును సంప్రదించింది. కొరియర్ పంపిన తరువాతి రోజు అదే కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి ఆమెకి ఫోన్ చేశాడు. మీరు పంపించిన కొరియర్‌లో ఆహారంతో పాటు ఆధార్ కార్డు, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డులు, 2 వేల యూఎస్‌డీ నగదు, ఇతర వస్తువులు ఉన్నట్లు చెప్పారు.
మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆరోపించాడు. ఆమెను నమ్మించేందుకు మరో ఇద్దరితో కలిసి ఉన్నతాధికారుల్లా నాటకమాడారు. వీడియో కాల్స్‌లో ఆమెకు యూనిఫాంలో కనిపించి మరింత భయపెట్టారు. విచారణ పేరుతో మహిళతో పది రోజుల పాటు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె బ్యాంకు ఖాతా వివరాలు సేకరించారు. తమ ఖాతాల్లోకి మహిళ ఖాతాలో ఉన్న రూ. కోటిన్నరను బదిలీ చేయించారు.ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు సూచించింది. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది.