తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది.ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫ్ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఒకరాత్రి ఆయన చర్లపల్లి జైలులోనే గడపాల్సి వచ్చింది. భారీ ట్విస్ట్‌ల మధ్య అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్ధని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది.అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మీమ్‌కు లైక్ చేశారు. అదే ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టింది. పుష్ప 2 ప్రస్తుతం బాహుబలి 2 రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్‌ను పెట్టి ఓ రీల్ చేశారు. అందులో బాహుబలిని ఎగిరి తన్నిన్నట్టుగా ఆ మీమ్ ఉంది. అలాంటి మీమ్‌ను అల్లు అర్జున్ లైక్ చేశాడు.