ఏఐ మోడళ్లు, అమెరికా మార్కెట్‌లోని ప్రముఖ ఏఐ మోడళ్లతో పోటీపడుతున్నాయని డీప్‌సీక్ కంపెనీ తెలిపింది.చైనా కంపెనీ ‘డీప్‌సీక్’ తెచ్చిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత చాట్‌బోట్ అమెరికాలో విడుదలైన కొద్దిరోజుల్లోనే యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన ఫ్రీ యాప్‌గా నిలిచింది.ఈ చాట్‌బోట్ ఈ జనవరిలోనే అమెరికాలో విడుదలైంది.
ఈ యాప్‌కి వచ్చిన విపరీతమైన జనాదరణ, అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే రూపొందడం వంటివి స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి.
దీనిపై సిలికాన్ వ్యాలీకి చెందిన పెట్టుబడిదారు మార్క్ ఆండ్రీసెన్ మాట్లాడుతూ, ”ఇది ఏఐలో అద్భుతమైన, అత్యాధునిక ఆవిష్కరణ”గా ప్రశంసలు కురిపించారు.
అతి తక్కువ ఖర్చుతో రూపొందిన తమ ఏఐ మోడళ్లు, అమెరికా మార్కెట్‌లోని ప్రముఖ ఏఐ మోడళ్లతో పోటీపడుతున్నాయని డీప్‌సీక్ కంపెనీ తెలిపింది.
ఈ యాప్‌ను రూపొందించేందుకు సుమారు 6 మిలియన్ డాలర్లు (అంటే, 51 కోట్ల రూపాయలు) మాత్రమే ఖర్చయిందని, అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న బిలియన్ డాలర్ల కంటే ఈ మొత్తం చాలా తక్కువని యాప్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన పరిశోధకులు చెబుతున్నారు.
అసలేంటీ డీప్‌సీక్?
డీప్‌సీక్ అనేది చైనాలోని హాంగ్‌ఝౌ నగరంలో ఏర్పాటైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ.
ఈ కంపెనీ 2023 జులైలో ప్రారంభమైనప్పటికీ, సంస్థ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ యాప్ ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకూ అమెరికన్ మార్కెట్‌లో విడుదల కాలేదని సెన్సార్ టవర్ పేర్కొంది.
లియాంగ్ వెన్‌ఫెంగ్ డీప్‌సీక్ వ్యవస్థాపకుడా?
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన 40 ఏళ్ల లియాంగ్ వెన్‌ఫెంగ్ తాను సేకరించిన హెడ్జ్ ఫండ్ నుంచి డీప్‌సీక్‌కు పాక్షికంగా నిధులను సమకూర్చారు. ఆయన అమెరికన్ టెక్ కంపెనీ ఎన్‌విడియా A100 చిప్‌లను భారీగా సేకరించినట్లు చెబుతారు, ప్రస్తుతం ఈ చిప్‌లు చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది.
ఈయన సేకరించిన చిప్‌ల సంఖ్య 50,000 వరకూ ఉంటుందని, వాటిని ఎగుమతులకు అవకాశమున్న చౌకైన, తక్కువ స్థాయి చిప్‌లతో అనుసంధానించే ప్రయత్నం డీప్‌సీక్ ఆవిర్భావానికి దారితీసినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల పారిశ్రామికవేత్తలు, చైనా ప్రీమియర్ లీ కియాంగ్ మధ్య జరిగిన సమావేశంలో లియాంగ్ కనిపించారు.
ఎవరు వాడుతున్నారు?
డీప్‌సీక్ ఏఐ యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఫ్రీ యాప్ సైన్ అప్(నమోదు) ప్రక్రియలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నప్పటికీ, యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా నిలిచింది.
అలాగే, అమెరికాలో.. యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్‌గానూ నిలిచింది.
ఎలా పనిచేస్తుంది?
చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే డీప్‌సీక్, తన శక్తిమంతమైన ఏఐ అసిస్టెంట్ కారణంగా అతితక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది.
యాప్ స్టోర్‌లో ” ఇది మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి రూపొందింది” అని ఈ యాప్ గురించి వివరించారు.
”ఇది మరింత దగ్గరగా సమాధానాలు ఇస్తోంది” అని యాప్‌కు రేటింగ్ ఇచ్చిన వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు.
అయితే, ఈ చాట్‌బోట్ రాజకీయంగా సున్నితమైన ప్రశ్నకు చేతులెత్తేసింది.
1989 జూన్ 4న తియానన్మెన్ స్క్వేర్‌లో ఏం జరిగిందని బీబీసీ ఈ యాప్‌ని అడగ్గా, ”ఐ యామ్ సారీ, నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను. నేను సహాయకారిగా ఉండడానికి, ఎలాంటి ఇబ్బంది లేని సమాధానాలు ఇవ్వడానికి రూపొందించిన ఏఐ అసిస్టెంట్‌ని” అని డీప్‌సీక్ సమాధానమిచ్చింది.ఎన్‌విడియా వంటి అమెరికన్ కంపెనీలకు భారీ దెబ్బ, ఎందుకు?
అమెరికన్ ఏఐ కంపెనీలు చేస్తున్న ఖర్చు కంటే కొన్ని వందల మిలియన్ డాలర్ల తక్కువ ఖర్చుతో ఈ డీప్‌సీక్ యాప్ రూపొందినట్లు చెబుతున్నారు. ఇది ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యంపై ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ అతితక్కువ ఖర్చు అంశం జనవరి 27న స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీదారులు, డేటా సెంటర్లతో సహా టెక్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాలు జరగడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్దాక్ 3 శాతానికి పైగా పడిపోయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కీలకమైన, శక్తిమంతమైన చిప్‌లను తయారుచేస్తున్న అమెరికన్ కంపెనీ ఎన్‌విడియా పై భారీ ప్రభావం పడినట్లు కనిపిస్తోంది.
సోమవారం ఒక్కరోజే ఆ కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 600 బిలియన్ డాలర్లు, అంటే సుమారు 51 లక్షల 91 వేల 650 కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. కంపెనీ స్టాక్ విలువ ఒక్కరోజులోనే దాదాపు 17 శాతం పడిపోయింది. అమెరికా చరిత్రలో ఒక కంపెనీ, ఒక్కరోజులో ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.
మార్కెట్ విలువపరంగా, ఎన్‌విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ. కానీ, సోమవారం ఒక్కరోజే దాని మార్కెట్ విలువ 3.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 2.9 ట్రిలియన్ డాలర్లకు పడిపోవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత మూడో స్థానానికి పడినట్లు ఫోర్బ్స్ రిపోర్ట్ చేసింది.
ఎన్‌విడియా అభివృద్ధి చేసిన అధునాతన సెమీకండక్టర్ చిప్స్ కంటే డీప్‌సీక్ వినియోగించిన చిప్స్ అధునాతనమైనవేమీ కావు. డీప్‌సీక్ సాధించిన విజయం, ఏఐ అభివృద్ధికి భారీగా నిధులు, అత్యాధునిక చిప్‌లు అవసరమనే భావనకు గండికొట్టింది. అత్యాధునిక చిప్‌ల అభివృద్ధి, వాటి అవసరంపై కూడా గందరగోళ పరిస్థితినిక్రియేట్ చేసింది.