spot_img
Sunday, July 20, 2025
spot_img

స్క్రీన్‌పై లక్షల్లో లాభాలు.. విత్‌డ్రా చేస్తే డబ్బులు రావు

డెంటల్‌ టెక్నీషియన్‌ వాట్సాప్‌కు గుర్తుతెలియని నెంబర్‌ నుంచి స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన ఒక మెసేజ్‌ వచ్చింది ఆ తరువాత ఓ ప్రత్యేక వాట్సాప్‌లో అతన్ని చేర్పించారు. స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు ఎలా వస్తున్నాయనే విషయంపై ఆ గ్రూపులో చర్చించుకుంటున్నారు. తమకు లాభాలొచ్చాయంటే తమకు లాభాలొచ్చాయంటూ మాట్లాడుకుంటున్నారు. కొత్తగా గ్రూపులో చేరిన డెంటల్‌ టెక్నీషియన్‌ కూడా ఇదంతా నిజమేనేమోనని నమ్మాడు.

ఆ తరువాత స్పెషల్‌ గ్రూప్‌ అంటూ వచ్చిన మరో మెసేజ్‌కికు వెంటనే స్పందించాడు. సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు విన్నాడు. ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. వాళ్లు చెప్పినట్టుగా కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. సైబర్‌ నేరగాళ్లు కూడా ఆరంభంలో లాభాలు చూపెడుతూ అతనికి నమ్మకం కుదిరేవరకు డబ్బును వెనక్కి ఇస్తూ వచ్చారు. దీంతో డెంటల్‌ టెక్నీషియన్‌కు వారిపై నమ్మకం బలపడింది. దీంతో దఫదఫాలుగా 7 లక్షల వరకు యాప్‌లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు.ఎప్పటికప్పుడు స్కీన్‌ప్రై లాభాలు కనిపిస్తున్నాయి. వాటిని విత్‌ డ్రా చేసుకోవాలంటే 20 శాతం కమిషన్‌ తమకు చెల్లించాల్సిందేనని షరతులు విధించారు. ఆ తర్వాత ఆ షరతులను పెంచుకుంటూ పోయారు. దాంతో తాను యాప్‌లో పెట్టిన పెట్టుబడికి తగినన్ని లాభాలు స్కీన్‌ప్రైన కనబడుతున్నాయే కానీ ఎన్నిసార్లు విత్‌ డ్రా బటన్‌ నొక్కినా ఒక్కపైసా అందులో నుంచి విత్‌డ్రా కాలేదు. దీంతో కళ్లు తెరిచిన బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సోషల్‌ మీడియాలోనో, ఆన్‌ లైన్‌లోనో ఎక్కడో ఒకచోట మెసేజ్‌ రూపంలో సైబర్‌ నేరగాళ్లు మొదట బాధితులతో కనెక్ట్‌ అవుతారు. ఆ తర్వాత ముగ్గులోకి దించి నిండా ముంచుతారు. నగరానికి చెందిన ఓ బాధితుడితో సంజనా అనే పేరుతో ఓ సైబర్‌ నేరస్తురాలు చాట్‌ మొదలు పెట్టింది. మెల్లగా స్నేహం పెంచుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ..తాను ట్రేడింగ్‌ చేస్తున్నానని చెప్పింది.అంతర్జాతీయంగా పేరున్న ఓ కంపెనీ పేరును ప్రస్తావించి ఆ కంపెనీ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంపై ట్రేడింగ్‌ చేస్తున్నానని నమ్మించింది. కావాలంటే కంపెనీ వారితో మాట్లాడిస్తానంటూ ఎవరితోనో మాట్లాడించి బాధితుడిని నమ్మించింది. అదే కంపెనీలో లాభాలు పెట్టి చాలామంది బాగుపడ్డారని కొంతమందితో బాధితుడికి ఫోన్‌ చేయించింది. అతడు నమ్మాక ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి అందులో 4.6 లక్షలు పెట్టుబడి పెట్టించింది. అందులో కూడా యాప్‌ స్కీన్‌ప్రై లాభాలు కనిపిస్తున్నాయి కానీ ఆ లాభాలను వెనక్కి తీసుకుందామంటే మాత్రం నయాపైసా విత్‌ డ్రా కాలేదు.

‘పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయండి. ప్రతిరోజూ వేలకు వేలు సంపాదించండి’ అనే ఓ ఆన్‌లైన్‌ ప్రకటన చూసి ఓ బాధితుడు ఆకర్షితుడయ్యాడు. సైబర్‌నేరగాళ్లు చెప్పిందంతా వింటూ చేసుకుంటూ పోయాడు. క్రిప్టో ట్రేడింగ్‌లో మంచి లాభాలొస్తాయని అందులో మెలమెల్లగా పెట్టుబడులు పెట్టిస్తూ వచ్చారు. ఎంత పెట్టుబడి పెడితే అంతకు మించి లాభాలొస్తాయని బాధితుడిని నమ్మించగలిగారు. యాప్‌లో పెట్టిన

పెట్టుబడికి స్కీన్‌ప్రై లాభాలూ చూపిస్తూ వచ్చారు. 14 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన బాధితుడు ఎన్నిసార్లు విత్‌ డ్రా బటన్‌ కొట్టినా డబ్బులు అకౌంట్‌లో జమ కావడం లేదు. క్రిప్టో ట్రేడింగ్‌ పేరుతో యాప్‌ను సృష్టించి పెట్టుబడి పెట్టించి తనను నిట్టనిలువునా ముంచారని తెలుసుకున్న బాధితుడు చివరికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.ఏ కష్టమూ లేకుండా డబ్బులొస్తున్నాయంటే..నెలల వ్యవధిలోనే రెట్టింపుకు మించి లాభాలొస్తున్నాయంటే చాలు వెనకా ముందు చూడకుండా నమ్మేస్తున్నారు. తమతో మాట్లాడుతున్న వారు ఎవరో కూడా తెలియనప్పటికీ..ఆన్‌ లైన్‌లో కనెక్ట్‌ అయితే చాలు గుడ్డిగా సరేనంటున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలొస్తున్నాయనే భ్రమలో ఉండిపోయి..అవతలి వ్యక్తి ఏం చెప్పినా సరే అది నిజమేనేమో అనుకొని వేలు, లక్షలు ముక్కూ మొహం తెలియని యాప్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. తీరా అదంతా అబద్ధమని తెలుసుకునే సరికి డబ్బులు వారి ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నాయి. ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నవారిలో విద్యావంతులే అధికంగా ఉండడం గమనార్హం.

ఈజీగా డబ్బు వస్తుందంటే అందులో మోసం ఉంటుందనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. తమకు అంతగా అవగాహన లేని స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై సైబర్‌నేరగాళ్లు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మేస్తూ నట్టేట మునుగుతున్నారు. ఇందులో మొదట తక్కువ మొత్తంలో లాభాలు వచ్చాయంటూ నమ్మకం కోసం సైబర్‌నేరగాళ్లు వేసే పథకానికి బాధితులు బోల్తా పడిపోతున్నారు. వందలు, వేలల్లో లాభాలు చూపిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పేరుతో సైబర్‌నేరగాళ్లు చేసే ఘరాన మోసాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు సైతం ఇస్తుంది. అవగాహనతోనే సైబర్‌నేరాలను అరికట్టగలమంటూ పోలీసులు సైతం అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు.

మోసం చేసేందుకు ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు సైబర్‌నేరగాళ్లు చాల తెలివిగా మాట్లాడుతూ అవతలివారిని బుట్టలో వేస్తుంటారు. ఒక వ్యక్తిని మోసం చేసే విధంగా తమ మార్కెటింగ్‌ నైపుణ్యాలను సైబర్‌నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. ఇలా కొందరు తెలిసి, తెలియక మోసపోతుంటే, మరికొందరు ఏమాత్రం అవగాహన లేకుండా తమ వాట్సాప్‌లకు వచ్చే మేసేజ్‌లను చూసి స్పందిస్తున్నారు. ఆ మేసేజ్‌లతో వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌లలో చేరి, ఆ తరువాత సైబర్‌నేరగాళ్లు చర్చించే విషయాలు నిజమని నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడిగా పెడుతూ లక్షలు పొగొట్టుకుంటున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇలాంటి ఫిర్యాదులు ప్రతి రోజు ఒకటి రెండు వరకు వస్తున్నాయి. అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular