అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ప్రభుత్వ అధికారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ ఉద్యోగులు నిర్దోషిగా నిరూపితమయ్యేవరకూ తిరిగి సర్వీసులోకి అనుమతించరాదని గురువారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొంది. ఇలాంటి వారిని మళ్లీ డ్యూటీలోకి చేర్చుకుంటే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
లంచం కేసులో దోషిగా నిరూపితమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్‌స్పెక్టర్ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కారు. గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు దోషిగా ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని.. తిరిగి సర్వీసులో చేరేందుకు అనుమతించాలని కోరుతూ పిటిష్ దాఖలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేసి ఇన్‌స్పెక్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, దోషిగా ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు నిరాకరించింది.’అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ అధికారిని సర్వీసులో కొనసాగడానికి అనుమతిస్తే అది వ్యవస్థ పునాదిని బలహీనపరుస్తుంది. ఇది నిజాయితీపరులైన అధికారులకు అవమానం అవుతుంది’ అని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే, ఇన్‌స్పెక్టర్ లంచం డిమాండ్ చేశాడని, తీసుకున్నాడని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల, శిక్షను నిలిపివేసి, తన క్లయింట్ ఉద్యోగంలో చేరేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే, ‘కె.సి. సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసును ఉటంకిస్తూ ధర్మాసనం ఇలా పేర్కొంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు న్యాయ విచారణలో తేలిన తర్వాత ఉన్నత న్యాయస్థానం అతడిని నిర్దోషిగా విడుదల చేసే వరకు అవినీతిపరుడిగా పరిగణించాలని చట్టాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ పెండింగ్‌లో ఉందనే కారణంతో దోషిగా తేలిన అధికారిని సర్వీసులో కొనసాగించడానికి అనుమతించకూడదు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసులో కొనసాగడానికి అనుమతిస్తే ప్రజల నమ్మకాన్ని దెబ్బతింటుంది.’ అంటూ పిటిషన్‌ను కొట్టివేసింది
అవినీతిపరుడిని మళ్లీ విధుల్లో చేర్చుకోవడం న్యాయమేనా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న..
RELATED ARTICLES