spot_img
Thursday, October 22, 2026
spot_img

ఎన్కౌంటర్ పింగళి దశరథ్ గారికి కూతురు  పింగళి చైతన్య అంతరంగం

ఈరోజు మా నాన్న చనిపోయినరోజు. to be factual చం .పే. సిన రోజు.  పొద్దున్నుండి post పెడదామా? వద్దా?  నా ఎమోషన్స్ ఎంత వరకు పర్సనల్, ఎంత సోషల్ అని తర్కిస్తూ ఉన్నా .  judge చేయటం / label చేయటం మనకి అల్వాటే. exemptions లేరు, ఉండరు. so, కక్కేస్తే అయిపోతది, ఉన్న వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు అనిపించింది.
మా నాన్న rights, wrong doings, mistakes, errors గురించి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆలోచిస్తున్నాను.  ధైర్యం ఎన్నిపాళ్లు? నైతిక తప్పులు ఏంటి? strategic mistakes ఏంటి? ఎలా రాసి ఉండాల్సింది? ఏం చేసి ఉండాల్సింది? etc etc.. రాయలేనంత పెద్ద list ఒకవైపు.
ఎప్పుడైనా పోతాను అని తెల్సినప్పుడు, పెళ్లి చేసుకోవటం ఎందుకు? చేసుకుని ఉంటే తల్లి, పెళ్లి కావాల్సిన చిన్న చెల్లెళ్ళు, భార్యా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేదా? డబ్బులు చేతిలో ఉన్న రోజుల్లో కాస్త savings చేసుకోవాల్సింది కదా అనే ఆలోచనలు ఇంకోవైపు. ఈ list ఇంకా పెద్దది.
సమాజంలో జరుగుతున్నది ఏదన్నా నచ్చకపోయినప్పుడు అటు వైపు ఆలోచిస్తాను. ఒకప్పుడు మా అమ్మ మీదా, ఇప్పుడు నా మీదా కుటుంబ బాధ్యతలు పడిన moments లో ఇటు వైపు ఆలోచిస్తాను. ఎప్పుడూ ఈ ఊగిసలాట ఉంటూనే ఉంది. బహుశా ఎప్పటికీ ఉంటుంది.
‘కూతురు కోసం అన్నా వంద గజాలు కొంటే నయం’ అని మా మామ్మ బతిలాడితే.. ‘మా నాన్నా నాకేం ఇచ్చాడు నా కూతురికి నా ఆస్తి మీద బతికే కర్మ ఏంటి? కాళ్లు చేతులు బానే ఉన్నాయి కదా. పది ఇళ్లలో పాచి పనైనా చేసుకుని బతుకుతుంది’ అనేవాడు అంట. ‘ఎంత బాధ్యత లేనితనమో, ఎంత మూర్ఖత్వమో..’ అని మా అమ్మ ఎన్నిసార్లు ఏడ్చిందో.
‘ఏదో ఒకటి కొనిపారేసి ఉంటే , ఈ తిట్లు తప్పేవి కదా’ అనుకునేదాన్ని. నాకు కొడుకు పుట్టాక అర్థం అయింది, ఆ మాట అనటానికి ఎంత నిబద్ధత, ధైర్యం కావాలో.  అందరికీ ఇది apply అవుతుంది, లేదు అని కాదు నేను చెప్పేది. as a parent ఎంత కష్టమో అలా అనుకోటం, అలా బతకటం. ఎంత ఇంటిగ్రిటీ కావాలో!
మా నాన్నా సినిమా స్టారో, రియల్ ఎస్టేట్ వ్యాపారో, దగ్గర ఉండి చదివించిన అమ్మానాన్నా ఉన్నవాడో కాదు. నిజానికి గాలికి పెరిగాడు. మా తాత మిలిటరీలో పని చేశాడు. సర్వీస్ లో ఉండగానే ఆయన చనిపోయారు. పింగళి వెంకయ్య గారు బతికే ఉన్నారు అప్పటికి. ‘పని చేసినందుకు జీతం ఇచ్చారు, దేశం కోసం పని చేసి బెనిఫిట్స్ తీసుకోటం ఏంటి ?’ అని ఒక్క బెనిఫిట్ పొందనివ్వ లేదు వెంకయ్య గారు. కొడుకు పిల్లల్ని ఆయనే పెంచారు . నాన్న ఎనిమిదో తరగతిలో ఉండగానే, వెంకయ్య గారు చనిపోయారు. సిరీస్ కంపెని రాజు గారు వెంకయ్య గారు ఉన్నప్పుడు కొంత సపోర్ట్ చేసేవాళ్ళు . వెంకయ్య చనిపోయాక, నాన్న స్కూల్ మానేసి, కుటుంబాన్ని సపోర్ట్ చేసేవారు.
ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మనిషి, పిల్లలు బతకలేరు, ఆస్తులు కావాలి అని ఎలా అనుకుంటాడులే అనుకునేదాన్ని. ఆ కొద్ది చదువు, లేబర్ వర్క్ చేసిన మనిషి పత్రికపెట్టడమే ఎక్కువ. యాడ్స్ తీసుకోకుండా, నడపడటమే ఎక్కువ, శీలపరీక్షలు ఏం చేస్తానులే అనుకునేదాన్ని. కార్లలో తిరిగే కోటీశ్వరలు, సినిమా స్టార్లు, వ్యాపారాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు మా నాన్న మీద అభిమానం చూపించినా, పాసింగ్ కామెంట్స్ చేసినా.. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది అని వదిలేసేదాన్ని. ఇది మా అమ్మ నాకు ఇచ్చిన చూపు .
కానీ రెండు రోజులు మా నాన్న పత్రిక నడిపిన ప్లేస్, ఆయన్ని చంపేసిన ఏరియా అయిన సత్యనారాయణ పురంలో ఉన్నాను . మా అమ్మ రిటైర్ అయిపోయాక అదే ఏరియా లో ఉంటోంది. మా అమ్మ, నాన్నల ప్రేమ, పెళ్లి, చావు అన్ని జరిగిన ప్రాంతం అది . ఆమె అక్కడికి shift అవటం వల్ల, ఈసారి నేను అక్కడకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏరియాలో ఒక రెండు రోజులు ఉన్నాక, మా నాన్న గురించి ఎన్ని iterations లో ఆలోచించానో. కానీ ఇప్పటి దాకా ఆయన్ని కులం అనే angle లో ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు నేను, మా తమ్ముళ్లు ఆ చట్రంలో బతకలేదు కాబట్టి, మా నాన్నకి exposure ఉన్న కులం angle ఎప్పుడూ మెదల్లేదు.  ఈ రెండు రోజులు అక్కడ గడిపాక, చుట్టాల మధ్య గడిపాక నాకు ఒకటి అర్థం అయింది. మా నాన్న inherently rebel.

ఆ కులం , ఆ కట్టుబాట్లు ఒక పాచిగుంట. కులవ్యవస్థను కాచి కాపాడే ఆ కులంలో పుట్టి, పెరిగి.. ఆ కంప నుండి పైకి ఎగరటం తేలిక కాదు. ‘కులనిర్మూలనకు నువ్ కట్టుబడి, పని చేయటం మొదలు పెడితే, నీ మొదటి శత్రువులు నీ కులం వారే’ అని అంబేద్కర్ చెప్పింది అక్షరాలా నిజం.
brothers and sisters of భారతదేశం.. ఆ కులంలో పుట్టి పెరిగి, దాన్ని కాదనుకున్న వాళ్ళ పట్ల సొంత వారు చూపే discrimination, సైకాలజికల్ టార్చర్ మాటల్లో చెప్పేది కాదు. అది  lonely బ్యాటిల్.
కుల వ్యవస్థను మూలకంటా కాపాడే కులంలో పెరిగి, ఆ వాతావరణంలో మాత్రమే exposure ఉన్న మా నాన్న ఆ పాచిగుంట నుండి బైట పడటం ఎంత కష్టమో, తండ్రి లేని బిడ్డలు అని జాలిపడి ఒక్క పండక్కి కూడా మమ్మల్ని బంధువులు ఎందుకు పిలవ లేదో నాకు మాత్రమే తెల్సిన సత్యం. నలభై ఏళ్ల తర్వాత కూడా నాన్న స్నేహితులే మమ్మల్ని ఎందుకు పలకరిస్తారో, నాకు కొత్త కోణంలో అర్థం అయింది.

బహుశా వయసు వస్తున్న కొద్దీ తల్లిదండ్రులు మరింతగా అర్థం అవుతారు కావొచ్చు. మా నాన్న చనిపోయి ఈరోజుకి నలభై ఏళ్లు పూర్తి అయ్యాయి. కుటుంబాన్ని దాటి, కులం అనే పాచి గుంట నుండి బైట పడని తండ్రుల కంటే మాకు నిలువ నీడ ఇవ్వని మా నాన్న మాకు ఎక్కువ మేలు చేసి, పోయాడు. నా జీవితానికి దారి చూపే సెర్చ్ లైట్ ఇచ్చి, వెళ్ళాడు. మా నాన్న చావు, బతుకు ఎంత పర్సనల్, ఎంత political ఇష్యూనో అనే గీత చెరుగిపోయింది.
Happy Death anniversary నాన్నా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular