తల్లి దండ్రులు కష్టపడి చదివిస్తుంటే వారి ఆశల్ని నిజం చేయలేకపోతున్నానని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో రాణించలేకపోవడంతో, తల్లిదండ్రులకు చెప్పలేక తనువు చాలించింది.
శ్రీకాకుళం జిల్లా దమ్మలవీధికి చెందిన మండా ఝాన్సీ (24) ఎచ్చెర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఝాన్సీ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కాలేదు. దాంతో సూసైడ్ చేసుకుంది. ఝాన్సీ తల్లి, అక్క శుక్రవారం రాత్రి సరంగడోల వీధిలో జరిగిన అయ్యప్పస్వామి భజనకు వెళ్లారు. ఝాన్సీని కూడా రమ్మంటే తరువాత వస్తానని చెప్పి ఇంటి వద్దే ఉండిపోయింది. ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తరువాత పక్కింటివాళ్లు ఎన్నిసార్ల తలుపుకొట్టినా ఝాన్సీ తలుపులు తీయలేదు. దాంతో విషయం ఆమె తల్లికి చెప్పారు. ఆమె వచ్చి చూసేసరికి ఝాన్సీ విగత జీవిగా కనిపించింది. అయితే ఇంట్లో ఓ లెటర్ దొరికింది.
నేను ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కాలేదు. మా ఫ్రెండ్స్ అంతా పాసయ్యారు. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాలో నేను నలిగిపోతున్నాను. లోపల చాలా బెంగగా ఉంది. చదవలేకపోతున్నా.. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నేను ఫెయిల్ అయ్యానని మీకు తెలిశాక మిమ్మల్ని ఫేస్ చేయలేను. అందుకే చనిపోతున్నా.. నన్ను క్షమించండి’ అని లేఖ రాసి చనిపోయింది. ఝాన్సీ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.