ఆన్ లైన్. గేమ్ లలో మోసపోయి భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్ చివరకు తానూ బలవన్మరణం చేసుకున్నాడు..
సిద్దిపేట, చిన్నకోడూరు, సిద్దిపేట టౌన్, ఆన్‌లైన్ గేమ్‌లు ఓ కుటుంబాన్ని మింగేశాయి.వాటిలో రూ.లక్షలు పోగొట్టుకొని, చేసిన అప్పులు తిరిగి చెల్లించే మార్గం లేక కలెక్టర్ గన్‌మాన్‌గా పనిచేస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ భార్య, ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలకు పిస్తోల్ గురిపెట్టి ఒకరి తరువాత ఒకరి ప్రాణాలు తీసి…చివరకు తనను తాను కాల్చుకుని మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేశ్(35) 2013లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ వద్ద గన్‌మాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నరేశ్‌కు కోహెడ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన చైతన్య(30)తో వివాహమైంది. కుమారుడు రేవంత్(7), కుమార్తె హితశ్రీ(5) ఉన్నారు. భార్య చైతన్య సిద్దిపేటలో ప్రైవేటు ఉపాధ్యాయురాలు. అక్కడే పిల్లలూ చదువుతున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన నరేశ్ కలెక్టర్ సెలవులో ఉండటంతో ఇంటికి వచ్చాడు. సర్వీసు పిస్తోల్ కూడా తనతో తెచ్చుకున్నాడు. పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైన భార్య, పిల్లలను ఆపి తొలుత భార్యను, ఆ తరువాత పిల్లలను పిస్తోల్‌తో కాల్చిచంపాడు. చివర్లో తానూ కాల్చుకొని కుప్పకూలాడు. శబ్దం రావడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు ఆయన సోదరుడు సురేశ్‌కు సమాచారమిచ్చారు. తన స్నేహితుడికి సురేశ్ ఫోన్ ద్వారా విషయం తెలియజేయగా అక్కడికి వెళ్లే సరికి నలుగురూ రక్తపుమడుగులో పడిఉన్నారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన లక్ష్మీ-రాములు దంపతులకు ముగ్గురు కుమారులు. మృతుడు నరేశ్ పెద్దవాడు. కొన్నాళ్లుగా ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడి భారీగా అప్పులపాలయ్యాడు. నెల క్రితం వరకు సిద్దిపేటలో అద్దె నివాసంలో ఉన్న ఆయన ఇటీవలే కుటుంబంతో సహా రామునిపట్లకు మకాం మార్చాడు. తల్లిదండ్రులు ఉండే ఇంటి సమీపంలోనే మరో ఇంట్లో ఉంటూ… ఇక్కడి నుంచే సిద్దిపేటలో విధులకు హాజరవుతున్నాడు. మూడు నెలల కిందట తన వాటాగా వచ్చిన వ్యవసాయ భూమిలో సుమారు 30 గుంటలను విక్రయించగా రూ.24.8 లక్షలు వచ్చాయి. అయినా మరో రూ.50 లక్షలకు పైగా అప్పులు ఉండడంతో సతమతమయ్యాడు. చివరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసు కమిషనర్ శ్వేత ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.




