spot_img
Monday, June 22, 2026
spot_img

పోలీసుశాఖలో నకిలీ పాస్‌పోర్టుల కలకలం అంతర్గత విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

విదేశీయులకు పాస్‌పోర్టులు జారీచేసిన ఉదంతం నేపథ్యంలో పోలీసుశాఖ ఉలిక్కి పడింది. నకిలీ ధ్రువపత్రాలతో మోసగించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి.అత్యంత కీలకమైన స్పెషల్‌ బ్రాంచి సిబ్బందిని నిందితులు ప్రలోభ పెట్టగలగడమే విస్మయానికి గురిచేసింది. తాజా ఉదంతం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోర్టు దరఖాస్తుల విచారణ చేసే స్పెషల్‌ బ్రాంచిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి.. అంతర్గత విచారణకు ఆదేశించారు. పాస్‌పోర్టు ఏజెంట్లతో కుమ్మక్కైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో 92 మంది నకిలీ పాస్‌పోర్టులతో విదేశీయులు విదేశాలకు వెళ్లినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో సగటున రోజుకు 3,800 మంది పాస్‌పోర్టు పొందేందుకు దరఖాస్తు చేస్తుంటారు. దరఖాస్తుదారుల చిరునామాల ఆధారంగా అవి సంబంధిత పోలీస్‌స్టేషన్లకు వెళతాయి. అక్కడ ఉండే స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది వ్యక్తిగతంగా దరఖాస్తుదారులను కలిసి, చుట్టుపక్కల విచారించి దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ నిజమే అని నిర్ధారించి.. నివేదిక పంపాలి. ఏమైనా తేడా ఉంటే ఆ విషయాన్ని పేర్కొనాలి. దరఖాస్తులో తప్పుడు వివరాలుంటే పాస్‌పోర్టు జారీ చేయరు. దరఖాస్తుదారుపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.

పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్తే ఇక్కడున్న దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేవు. ముంబయి పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్‌ అనుచరుడు అబూసలేం, అతని ప్రియురాలు మోనికాబేడీ ఇలానే కర్నూలులో నివాసముంటున్నట్లు తప్పుడుపత్రాలు సృష్టించి విదేశాలకు పారిపోయారు. 2002లో బయటపడ్డ ఈ ఉదంతం ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తర్వాత స్పెషల్‌ బ్రాంచి విచారణను మరింత కట్టుదిట్టం చేశారు. పాస్‌పోర్టు దరఖాస్తులు ఎక్కువవుతుండటంతో విచారణ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ చేశారు. అయినప్పటికీ తాజా కుంభకోణం సూత్రధారి అబ్దుస్‌ సత్తార్‌ ఒస్మాన్‌ అల్‌ జవహరి, అతని ముఠా సభ్యులు తెలివిగా స్పెషల్‌ బ్రాంచి సిబ్బందిని ప్రలోభపెట్టి పనికానిచ్చారు. యాదృచ్ఛికంగా బయటపడ్డ ఈ కుంభకోణం తెలంగాణ పోలీసుశాఖలో సంచలనం సృష్టించింది. దాంతో అధికారులు రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జారీ అయిన కొన్ని పాస్‌పోర్టుల వివరాలను పునఃపరిశీలించాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఘటనను దృష్టిలో ఉంచుకొని పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనలో దొర్లుతున్న లోపాలను సరిదిద్ది మరింత పటిష్ఠంగా రూపొందించాలని అధికారులు నిర్ణయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular