spot_img
Tuesday, March 24, 2026
spot_img

వెబ్‌సిరీస్ చూసి దొంగనోట్లను తయారు చేసిన నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్ఓటీ, అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 150 సార్లు వెబ్‌సిరీస్ చూసి దొంగనోట్లు ఫ్రింట్ చేయడం ప్రారంభించినట్లు గుర్తించారు.

అల్లాపూర్ సీఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం…వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ (37) కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. బోడుప్పల్‌లోని మారుతీనగర్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడిపై గతంలో కొన్ని పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగి ఎరుకల ప్రణయ్‌కుమార్ ఇతడికి మిత్రుడు. కొంత కాలంగా ఆర్థిక పరిస్థితి దిగజారడంతో లక్ష్మీనారాయణ దొంగనోట్ల చలామణీకి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి దొంగనోట్ల ప్రింటింగ్ కు సంబంధించి ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌ గురించి తెలుసుకున్నాడు. ఓటీటీలో ఈ సిరీస్‌ను రెండు నెలల్లో 150 సార్లు చూశాడు. ఆ తర్వాత దొంగ నోట్ల ప్రింటింగ్ కు కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకున్నాడు. ప్రణయ్ కుమార్‌తో 1:3 నిష్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్నాక తొలి విడతగా రూ.3 లక్షల విలువైన దొంగనోట్లు ముద్రించి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అతడితో చలామణీ చేయించాడు. తొలి ప్రయత్నం సక్సెస్ కావడంతో మరో మారు దొంగనోట్ల చలామణీకి రెడీ అయ్యారు.

ఈక్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా ఉన్న లక్ష్మీనారాయణ, ప్రణయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న 810 రూ.500ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేయగా ప్రింటర్, ల్యాప్‌టాప్, ఇతర ముద్రణ సామగ్రి కూడా లభించాయి. దొంగనోట్లు ముద్రిస్తున్న గదిలోకి లక్ష్మీనారాయణ తన కుటుంబసభ్యులను కూడా రానీయకుండా తాళం పెట్టేవాడని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular