ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుని కోరారు. ఒంటిపై ఉన్న నగలను అనుమతించాలని.. ప్రత్యేకంగా బెడ్, బెడ్ షీట్లు, చెప్పులు, ట్యాబ్‌లెట్‌లు ఇవ్వాలని అడిగారు. కవిత ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ వసతులు కల్పించాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. అయితే.. ఆ ఆదేశాల్ని అధికారులు పెడచెవిన పెట్టడంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఆమెను రాజకీయ నిందితురాలిగా గుర్తించి ఆమెకు వసతులు కల్పిచాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో.. తనకు ఖాళీ సమయంలో చదువుకునేందుకు కొన్ని పుస్తకాలు కూడా కావాలని కవిత కోరారు. ఆమె అడిగిన జాబితాలో ఓ పుస్తకం గురించి తెలిసి.. లాయర్లు, బీజేపీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆమె అడిగిన పుస్తకమేంటో తెలుసా? బీజేపీ సిద్ధాంతాలకు పునాది అయిన ఆర్ఎస్ఎస్ రచించిన ‘‘21వ శతాబ్ధానికి ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్’. ఈ పుస్తకం కావాలని కవిత అడగడంతో.. ఆమె ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారా? అనేది అందరూ చర్చించుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముద్రితమైన ఈ పుస్తకంలో.. స్వయంసేవక్‌లు ప్రభుత్వంలో ఉన్నత స్థానాలకు ఎదగడంతోపాటు సంఘ్ ప్రధాన ఆలోచనలైన హిందూ రాష్ట్ర ఏర్పాటు, ఏకాత్మత, సామాజిక, రాజకీయ అంశాలు వంటివి ఉన్నాయి. భారత్ పట్ల ఆర్ఎస్ఎస్ ఆలోచనలేంటి? భారత్ హిందూ రాష్ట్రంగా మారితే.. ముస్లిం, ఇతర మత విశ్వాసలకు చెందిన ప్రజల పరిస్థితి ఏంటి? కుల రాజకీయాలను హిందుత్వం అధిగమిస్తుందా? మారుతున్న కుటుంబ స్వభావం, విభిన్న లైంగిక ధోరణులు, వ్యక్తుల హక్కులకు సంబంధించిన సామాజిక సమస్యలపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఏమిటి? వంటి వివాదాస్పద అంశాలను ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ ఈ పుస్తకంలో విశ్లేషించారు.. కేపి




