తెలంగాణలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి షేర్లు విక్రయిస్తామంటూ రూ.10 వేలు ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. రూ.2.29 కోట్లు కొట్టేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి (Bachipalli) చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి (51) ఫోన్ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు జులై 10న ‘కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్’ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. నారాయణ జిందాల్ అనే వ్యక్తి కోటక్ సెక్యూరిటీస్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా పని చేస్తున్నారని, షేర్ల క్రయవిక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని.. గ్రూపులోని సభ్యులు తరచూ చాటింగ్ చేసేవారు. ఈ నెల 2 నుంచి ప్లాన్ ప్రారంభిస్తున్నట్లు నారాయణ జిందాల్ పేరుతో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. ఇందులో చేరాలంటే కోటక్ ప్రో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. వీఐపీ ట్రేడింగ్ ప్లాన్లో చేరితే లాభాలు వస్తాయని చెప్పేవాడు. చాలా మంది తమకు లాభాలు వచ్చాయని పోస్ట్ చేసేవారు.ఇదంతా నిజమని నమ్మిన సాప్ట్ వేర్ ఇంజినీర్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. అందులో కస్టమర్ కేర్ ప్రతినిధి సూచనల ప్రకారం డబ్బులు పంపించేవాడు. తొలిసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు మరుసటి రోజు యాప్లో మోసగాళ్లు చూపించారు. ఈ క్రమంలో పలు ధపాలుగా రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇలా మొత్తం రూ.2.29 కోట్లు బదిలీ చేయించుకున్నారు. కేవలం రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. రూ.2.29 కోట్ల పెట్టుబడికి రూ.1.10 కోట్ల లాభం వచ్చిందని.. మరో రూ.40 లక్షలు కడితేనే విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఈ నిబంధనలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అనుమానం రావడంతో.. ఆరా తీయగా అది మోసమని తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది.
తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి రూ.10 వేలు ఆశ చూపి రూ.2.29 కోట్లు కొట్టేశారు
RELATED ARTICLES




