spot_img
Monday, July 21, 2025
spot_img

‘ఎ హ్యాండ్‌ బుక్‌ ఆన్‌ బేసిక్స్‌ ఆఫ్‌ సైబర్‌ హైజీన్‌’ బుక్ విడుదల

చుట్టూ సైబర్‌ దొంగలు.. ఆదమరిస్తే అంతే!

1) పాటైం ఉద్యోగాల నుంచి హనీ ట్రాప్‌ దాకా..

2) ఎన్నెన్నో మార్గాల్లో వల వేస్తున్న నేరస్థులు గురించి పలు సూచనలతో యూజీసీ హ్యాండ్‌ బుక్‌

విద్యార్థుల్లో అవగాహన కోసం విడుదల చేశారు

పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు లాంటి వ్యక్తిగత వివరాలు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారా? భారీ డిస్కౌంట్ల పేరుతో ఊరించే ప్రకటనల లింక్‌లు క్లిక్‌ చేస్తున్నారా? అయితే మీరు సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కే ప్రమాదం ఉన్నట్టే. దేశంలో సైబర్‌ మోసాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఎంతోమంది వీటి బారిన పడి లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల్లో అవగాహన కలిగించటం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ‘ఎ హ్యాండ్‌ బుక్‌ ఆన్‌ బేసిక్స్‌ ఆఫ్‌ సైబర్‌ హైజీన్‌’ పేరుతో ఇటీవల ఒక ఈ-బుక్‌ విడుదల చేసింది.
సైబర్‌ నేరగాళ్లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు, వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలన్న అంశాల్ని దీంట్లో తెలియజేశారు. ఆ వివరాలు.. పార్ట్‌ టైం ఉద్యోగాలు, వర్క్‌ఫ్రం హోం, లైక్‌లు, షేర్లు, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, ఫెడెక్స్‌ పార్సిల్‌, డ్రగ్స్‌ కేసు, డిజిటల్‌ అరెస్ట్‌.. ఇలా రకరకాలుగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హనీ ట్రాప్‌, సెక్స్‌టార్షన్‌, ట్రోలింగ్‌, పోర్నోగ్రాఫ్‌, కెరీర్‌ తదితర మార్గాల్లోనూ వారు కన్నేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వారినీ టార్గెట్‌ చేసుకొని మెసేజీలు, కాల్స్‌ చేస్తున్నారు..

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పుట్టిన తేదీ, గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన ఏడాది, తల్లిదండ్రుల పేర్లు.. వంటి వ్యక్తిగత వివరాలు సోషల్‌ మీడియాలో పెట్టొద్దు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.

స్పామ్‌ ఈ-మెయిల్స్‌, సోషల్‌ మీడియాలో అనుమానాస్పద ఫ్రెండ్‌ రిక్వెస్టులపై స్పందించవద్దు. తెలియని వెబ్‌సైట్‌ లింకులను తెరవొద్దు. అనవసరమైన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.

ఉచితం, భారీ డిస్కౌంట్లు అంటూ వచ్చే ప్రకటనలకు అనాలోచితంగా స్పందించవద్దు.

అనేక యాప్‌లు.. డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు కాంటాక్ట్‌, కెమెరా, క్యాలెండరు యాక్సెస్‌(అనుమతి) అడుగుతాయి. యాప్‌ల గురించి క్షుణ్ణంగా తెలిస్తేనేఅనుమతించాలి. అనవసరంగా యాక్సెస్‌ అడిగే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రతిసారీ పాస్‌వర్డ్‌ నమోదు చేయకుండా’రిమెంబర్‌ మీ’, ‘రిమెంబర్‌ పాస్‌వర్డ్‌’ వంటి ఆప్షన్లు ఉంటాయి. వాటిని సేవ్‌ చేస్తే.. మోసాలకు అవకాశం ఇచ్చినట్టే.

ఇంట్లో ఉన్న ఉపకరణం పాడైతే సదరు కంపెనీకి ఫిర్యాదు చేసేందుకు కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం చాలామంది గూగుల్‌లో వెదుకుతారు. కానీ, ఇటీవలి కాలంలో ఆయా కంపెనీల కస్టమర్‌ కేర్‌ నెంబర్ల పేరుతోనూ సైబర్‌ మోసగాళ్లు వల పన్ని ఉంటున్నారు. కాబట్టి, కంపెనీ నెంబర్‌ కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌నే సందర్శించాలి.

పబ్లిక్‌ వై-ఫై, ఫ్రీ వై-ఫై జోన్లలో అందించే ఇంటర్‌నెట్‌తో ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు జరపొద్దు. వ్యక్తిగత ఇంటర్‌నెట్‌నే వినియోగించాలి.

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సన్నిహితులతో కూడిన ఫొటోలు, వీడియోలు, ఆధార్‌, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల లాంటి డాక్యుమెంట్లు, వైద్యానికి సంబంధించిన సమాచారం.. సెల్‌ఫోన్లలో పెట్టుకోకపోవడమే మేలు.

ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్లతో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్‌ నుంచి పీడీఎఫ్‌ ఉచిత కన్వర్టర్‌, ఇమేజ్‌ రీసైజ్‌.. లాంటి సాఫ్ట్‌వేర్‌లు ఉచితంగా అందిస్తూ సమాచారాన్ని తస్కరిస్తాయి.

ఉచిత సాఫ్ట్‌వేర్లను అందిస్తూ అవసరానికి ఆదుకుంటూనే.. సమయం దొరకగానే అందినంత దండుకునే యాప్‌లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular