ప్రేమ, వైవాహిక బంధాల్లో బ్రేకప్, విడిపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య జరుగుతుంటాయి. కానీ ఈ ఆత్మహత్యల కేసుల్లో బ్రేకప్ చేసుకున్న వారిని శిక్షించేందుకు వీల్లేదని ఏదైనా నేరపూరిత ఉద్దేశ్యం ఉంటేనే శిక్షించేందుకు అవకాశం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది.
ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమని శిక్ష పడిన ఒక నిందితుడు సుప్రీం కోర్టులో పిటీషన్ వేయగా.. కేసు విచారణ చేసిన ద్విసభ్య ధర్మాసనం ఈ విధంగా చెప్పింది. “ఇది ఒక బ్రేకప్ చేసుకున్న కేసు. ఇద్దరు కలిసి ఉంటేనే బంధం అంటారు. కానీ ఈ కేసులో ఒకరు ఆ బంధాన్ని తెంచుకున్నారు. ఇందులో నేరం లాంటిదేమి లేదు. అందుకే నిందితుడు శిక్షార్హుడు కాడు”. అని జస్టిస్ పంకజ్ మిఠాల్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 17 పేజీల తీర్పు వెలువరించింది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన కమరుద్దీన్ దస్తగీర్ సనాడీ అనే వ్యక్తి తన ప్రియురాలితో గతంలో బ్రేకప్ చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఆత్మహత్యకు కమరుద్దీన్ వేధింపులే కారణమని ఒక ట్రయల్ కోర్టులో ఇండియన్ పీనల్ కోడ్ లోని చీటింగ్, ఫ్రాడ్ (సెక్షన్ 420), ఆత్మహత్యను ప్రేరేపించడం (సెక్షన్ 306), రేప్ (సెక్షన్ 376) ఆరోపణలలో కేసు నడిచింది. కానీ స్థానిక కోర్టు.. కమరుద్దీన్ నిర్దోషి అని అతడిని విడుదల చేసింది.ట్రయల్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది హై కోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుని విచారణ చేసిన కర్ణాటక హై కోర్టు కమరుద్దీన్ ని చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాలపై దోషిగా తేలుస్తూ 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.25,000 ఫైన్ విధించింది.
హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కమరుద్దీన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అయితే సుప్రీం కోర్టు ఈ కేసుని మళ్లీ ముందునుంచి విచారణ చేసి.. ఈ కేసులో ముందుగా మృతురాలి తల్లి ఫిర్యాదు చేసిందని.. మృతురాలు కమరుద్దీన్‌ని ప్రేమించి అతడితో 8 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉందని ఆగస్టు 2007లో ఆమె మరణించిందని వివరాలు పరిశీలించింది.నిందితుడు కమరుద్దీన్ పెళ్లి చేసుకుంటానని చెప్పి 8 ఏళ్ల వరకు మృతురాలితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నాడని ప్రభుత్వ లాయర్ వాదించారు. కానీ ఆత్మహత్య చేసుకున్న యువతి తన సూసైడ్ లెటర్ లో నిందితుడే తన చావుకు కారణమని ఎక్కడా రాయలేదని దీంతో అతడు నేరస్తుడని నిర్ధారణ చేయలేమని చెబుతూ హై కోర్టు తీర్పును తప్పబట్టింది. “ఒక వేళ మృతరాలు మానసిక హింసికు గురైనా, మన సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువగా డిప్రెషన్, భావోద్వేగం కారణంగా జరుగుతుంటాయి. దీంతో ఆత్మహత్యలు చేసుకునేవారు ఆ సమయంలో ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు? ఏ కచ్చితమైన కారణాలతో ఆ నిర్ణయం తీసుకున్నారో చెప్పడం కష్టం” అని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.
“కానీ ఆత్మహత్యల కేసుల్లో ఏదైనా ఉద్దేశ పూర్వక నేరం ఉందని నిరూపణ అయితే నిందితుడు శిక్షర్షుడవుతాడు. కానీ ఈ కేసులో అటువంటిదేమీ ఉన్నట్లు ఆధారాలు లేవు.” అని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.