spot_img
Monday, March 23, 2026
spot_img

జగదీష్ మార్కెట్‌లో పోలీసుల మెరుపుదాడి.. రూ.కోటి నకిలీ ఆపిల్ ఫోన్ల పట్టివేత

హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ముఖ్యంగా, ప్రముఖ బ్రాండ్ అయిన ఆపిల్ (Apple) పేరుతో నకిలీ మొబైల్ విడిభాగాలను విక్రయిస్తున్న ఒక పెద్ద ముఠాను పోలీసులు పట్టుకున్నారు.దాదాపు రూ.1.01 కోటి విలువైన నకిలీ ఆపిల్ టూల్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ మోసానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది.

జగదీష్ మార్కెట్‌పై పోలీసుల దాడులు

అబిడ్స్, కోఠి ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ప్రసిద్ధి చెందిన జగదీష్ మార్కెట్‌ను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు చాలా కాలంగా నకిలీ ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని సమాచారం. పోలీసులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి, నకిలీ ఆపిల్ బ్రాండెడ్ టూల్స్ ను కొనుగోలు చేసి, పంపిణీ చేస్తున్న నలుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ నిందితులు చాలా పకడ్బందీగా మోసాన్ని నడిపిస్తున్నారు. అసలైన ఆపిల్ లోగోలను, ప్యాకేజింగ్‌ను అచ్చుగుద్దినట్లు కాపీ చేసి, వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఇది కేవలం వినియోగదారులను మోసగించడమే కాదు, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడం, ఆపిల్ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి తీవ్రమైన నేరాలు.

నిందితుల ముఖాలు దాచిపెట్టడంపై ప్రజాగ్రహం

పోలీసులు ఈ కేసులో పట్టుబడిన నిందితుల వీడియోను విడుదల చేశారు. అయితే, ఆ వీడియోలో నిందితుల ముఖాలను దాచిపెట్టారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “వారి ముఖాలను ఎందుకు దాచారు? వారి పేర్లు ఏమిటి? ఒకసారి విడుదలైన తర్వాత, వారు మళ్ళీ ఈ మోసాలను కొనసాగించవచ్చు” అని చాలా మంది ప్రశ్నించారు.

“ప్రజలు వారిని ఎలా గుర్తించాలి లేదా తమను తాము ఎలా రక్షించుకోవాలి?” అని మరికొందరు ప్రశ్నించారు. అధికారులు ఈ స్కాం వెనుక ఉన్న పెద్దలను పట్టుకోవడంపై దృష్టి పెట్టాలి, కేవలం చిన్నపాటి వ్యక్తులను కాదు. కోటి రూపాయలకు పైగా విలువైన వస్తువులను ఒక సామాన్యుడు కలిగి ఉండటం అసాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నకిలీల మార్కెట్‌కు పెద్ద దెబ్బ

హైదరాబాద్ నకిలీ మార్కెట్‌కు ఈ దాడులు ఒక పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. తరచుగా లో క్వాలిటీ, ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులతో మార్కెట్‌ను నింపడం ద్వారా నకిలీ వ్యాపారులు వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. పోలీసులు వీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular