18 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు(Ayesh Meera Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసు రీ ఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ(CBI) హైకోర్టు(High Court)కు తన తుది నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ కోర్ట్ ఈనెల 26కు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో సీబీఐ అందజేసిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఆయేషా మీరా హత్య జరిగిన 2007 నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.
ఆయేషా మీరా హత్య కేసు.. 2007 డిసెంబర్ 27న విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గ లేడీస్ హాస్టల్‌లో17 ఏళ్ల బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా వాష్‌రూమ్‌లో దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి, 2008లో పిడతల సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 2010లో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం, హత్య ఆరోపణలతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ, 2017లో హైదరాబాద్ హైకోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించి, పోలీసు దర్యాప్తులో లోపాలను ఎండగట్టింది. దీంతో ఆయేషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2018లో హైకోర్టు ఈ కేసును రీ ఓపెన్ చేసి సీబీఐకి అప్పగించింది. అలాగే, 2014లో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి, దానిపై మరో కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
సీబీఐ 2019లో ఆయేషా మృతదేహాన్ని తవ్వి రీ-పోస్ట్‌మార్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాలను నిర్ధారించి, 2020లో ఒక నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ఇచ్చారు. 2023లో సీబీఐ ఆయేషా కుటుంబ స్నేహితుడు పుసపటి కృష్ణ ప్రసాద్, నాటి నందిగామ డీఎస్పీ ఎం. శ్రీనివాసులతో సహా పలువురు సాక్షులను విచారించింది. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు, ఆధారాలు నాశనం కావడం, దర్యాప్తులో జాప్యం వంటి సమస్యల వంటి పరిణామాల అనంతరం సీబీఐ తన తుది నివేదికను నేడు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించగా.. కోర్టు ఈ కేసు విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. ఈ కేసు గత 18 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఆయేషా తల్లి షమ్షాద్ బేగం, తండ్రి ఇక్బాల్ బాషా ఈ కేసులో న్యాయం కోసం 18 ఏళ్లుగా నిరంతరం పోరాడుతున్నారు.
ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు
RELATED ARTICLES