హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడానికి నగర పోలీసులు కొత్తగా చేపట్టిన కార్యక్రమం.. ఆపరేషన్ కవచ్. ఈ వీకెండ్ లో దీన్ని నిర్వహించారు.పెద్ద ఎత్తున నాకాబందీ చేపట్టారు. ఇది అంచనాలకు మించిన ఫలితాలను ఇచ్చింది. పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. గంజాయి సైతం దొరికింది పోలీసులకు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హవాలా వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, ప్రజా భద్రతను పెంపొందించడం ఈ డ్రైవ్ ముఖ్యఉద్దేశం.
ఈ ఆపరేషన్ కోసం హైదరాబాద్‌లోని 150 వ్యూహాత్మక ప్రాంతాల్లో 5,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా గుల్జార్ హౌజ్ వద్ద వాహనాల తనిఖీని స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 25 వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులను ప్రశ్నించారు. వారి డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్ సీ, పొల్యూషన్, వెహికల్ ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్లను సజ్జనార్ స్వయంగా పరిశీలించారు.
రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున ఒంటిగంట వరకు నగరంలోని 150 ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులు విస్తృత నాకాబందీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 15,000 వాహనాలను పరిశీలించారు. వీటిలో 1,600 వాహనాలను సీజ్ చేశారు. అలాగే- ఎనిమిదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి అర్ధకేజీ వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 105 పెట్టి కేసులు నమోదు చేశారు.
ఈ క్షేత్రస్థాయి ఆపరేషన్ పర్యవేక్షణ అనంతరం సజ్జనార్.. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సీసీటీవీల ద్వారా శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ‘ఆపరేషన్ కవచ్’లో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్), బ్లూ కోల్ట్స్, సిటీ పెట్రోల్ స్క్వాడ్స్‌తో సహా బహుళ పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేశాయి. విస్తృతంగా వాహనాల తనిఖీలను నిర్వహించాయి.
స్వయంగా రంగంలో దిగిన సజ్జనార్.. !!
RELATED ARTICLES




