హైదరాబాద్ (కోబ్రా న్యూస్):
గోపనపల్లిలో ఉన్నతాధికారులే స్వయంగా ఒక పెద్ద భూకుంభకోణానికి తెరతీశారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని రంగనాథనగర్ లేఅవుట్‌లో ప్లాట్ల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి ప్రభుత్వ జీవో లేకుండానే నిలిపివేయడం వెనుక భారీ సెటిల్‌మెంట్ల బాగోతం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జీవో లేకుండా రిజిస్ట్రేషన్ల ఆపివేత – చట్ట విరుద్ధమా?
చట్టపరంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటే సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు (GO) తప్పనిసరి. అయితే ఈ కేసులో ఎలాంటి జీవో లేకుండా నోటిమాట ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో సబ్‌రిజిస్ట్రార్లు తీవ్ర అయోమయంలో పడ్డారని సమాచారం.
2005 ముసాయిదా గెజిట్‌కు కాలం చెల్లిందా?
రంగనాథనగర్ లేఅవుట్ భూములను ఐటీ సెజ్ కోసం స్వాధీనం చేసుకుంటామని 2005లో ముసాయిదా గెజిట్ వెలువడింది. కానీ ఆ తరువాత ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయలేదు. అంతేకాదు, 2014 జూన్ 9న అప్పటి కలెక్టర్ ఎండార్సుమెంట్ ద్వారా ఆ గెజిట్‌కు కాలం చెల్లిందని స్పష్టత ఇచ్చారు.
ఇటీవల (2024 ఏప్రిల్ 18న) ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా ఈ భూములను స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని, భూముల విలువలు అధికంగా పెరిగిన కారణంగా సేకరణ సాధ్యం కాదని అధికారికంగా లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
439 ఎకరాలు – ఇప్పటికే నిర్మాణాలు
గోపనపల్లిలోని సర్వే నంబర్లు 127–173, 263–286 మధ్య ఉన్న 439 ఎకరాల పట్టా భూముల్లో సగానికి మించి విల్లాలు, నివాస నిర్మాణాలు ఇప్పటికే ఉన్నాయి. స్వాధీనం ఉద్దేశమే లేకపోతే రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపివేస్తున్నారన్న ప్రశ్నలు స్థానికుల్లో వెల్లువెత్తుతున్నాయి.
రియల్ ఎస్టేట్ వర్గాల ఆరోపణ
“కొంతమందికి అనుకూలంగా భూమి సెటిల్‌మెంట్లకు అవకాశం కల్పించేందుకే ఈ చర్యలు” అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జీవో లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దేశంలోనే ఎక్కడా లేని పరిణామం అని వారు అంటున్నారు.
ప్రజల డిమాండ్
జీవో లేకుండా ఆపిన రిజిస్ట్రేషన్లపై తక్షణ స్పష్టత
అధికారిక ఉత్తర్వులు ప్రజలకు వెల్లడించాలి
బాధ్యులపై విచారణ, చర్యలు చేపట్టాలి
కోబ్రా న్యూస్ డిమాండ్:
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు చట్టబద్ధ ఆధారాలున్నాయా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. లేదంటే ఇది పెద్ద భూకుంభకోణంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
— కోబ్రా న్యూస్ Exclusive | క్రైమ్ & ఇన్వెస్టిగేషన్ డెస్క్




